Reading Time: 2 minutes
Ravi Kishan Yoga Video Viral Gutkasan Memes

Ravi Kishan : ‘రేసుగుర్రం’ సినిమాలో ‘మద్దాలి శివారెడ్డి’గా తన విలనిజంతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించారు నటుడు రవి కిషన్. భోజపురి సూపర్ స్టార్ అయిన ఆయన.. ప్రస్తుతం రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నారు. ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్‌పూర్ పార్లమెంట్ స్థానం నుండి వరుసగా రెండోసారి ఎంపీగా గెలిచి చక్రం తిప్పుతున్నారు. అయితే, తాజాగా ఈ యాక్టర్ కమ్ పొలిటీషియన్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం (జూన్ 21) సందర్భంగా గోరఖ్‌పూర్‌లో జరిగిన ఒక యోగా కార్యక్రమంలో ఆయన పాల్గొన్న వీడియో ఇప్పుడు నెట్ ఇంట పెద్ద దుమారమే రేపుతోంది.

బాడీకే కాదు.. నోటికి కూడా ఎక్సర్‌సైజ్

ఈ యోగా కార్యక్రమంలో రవి కిషన్ ఆసనాలు వేస్తూనే, నోట్లో ఏదో వేసుకుని నములుతూ కెమెరా కంటికి చిక్కారు. దాంతో నెటిజన్లు ఊరుకుంటారా.. ఆయనపై సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. ఆయన నములుతోంది పక్కాగా ‘గుట్కా’ లేదా ‘ఖైనీ’ అంటూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. “యోగా చేసేటప్పుడు కేవలం శరీరానికి మాత్రమే ఎక్సర్‌సైజ్ ఇస్తే సరిపోతుందా? నోటికి కూడా కావాలి కదా” అంటూ ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. మరికొందరైతే ఆయన వేసిన ఆసనానికి ‘గుట్కాసన్’ అని పేరు పెట్టి జోకులు పేలుస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నేషనల్ వైడ్‌గా తెగ వైరల్ అవుతోంది.

 

రవి కిషన్‌పై ఈ రేంజ్‌లో ట్రోలింగ్ జరుగుతుండటంతో ఆయన ఫ్యాన్స్ కూడా రంగంలోకి దిగారు. నోట్లో ఏదో నమిలినంత మాత్రాన అది గుట్కానే అని ఎలా చెప్తారు? గొంతు బాగుండటానికి లేదా ఆరోగ్యం కోసం వాడే వాము (అజ్వైన్), యాలకులు, లవంగాలు కూడా కావచ్చు కదా అంటూ కౌంటర్లు ఇస్తున్నారు. ఏదేమైనా ఒక పాపులర్ యాక్టర్, పైగా బాధ్యతాయుతమైన ఎంపీ పదవిలో ఉన్న వ్యక్తి ఇలా యోగా చేస్తూ దొరికిపోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

వీధి నాటకాల నుండి పార్లమెంట్ వరకు..

రవి కిషన్ సినీ ప్రయాణం అంత ఈజీగా సాగలేదు. కెరీర్ మొదట్లో ఆయన వీధి నాటకాల్లో సీత పాత్రలు వేసేవారు. అయితే పౌరోహిత్యం చేసుకునే సాంప్రదాయ కుటుంబం కావడం వల్ల, కొడుకు నటన వైపు వెళ్లడం ఇష్టం లేక తండ్రి ఆయన్ను విపరీతంగా కొట్టేవారట. కొడుకు పడే కష్టాలు చూడలేక వాళ్ల అమ్మ రూ.500 చేతిలో పెట్టి ముంబై పంపించేసింది. ముంబైలో అడుగుపెట్టిన రవి కిషన్ మొదట్లో చిన్న చిన్న బాలీవుడ్ పాత్రలు చేస్తూ, ఆ తర్వాత భోజపురి సినిమాల్లో స్టార్ హీరోగా ఎదిగారు. ఇప్పుడు రాజకీయాల్లోనూ ఎంపీగా రాణిస్తూ ఇలా ఊహించని వివాదంలో చిక్కుకున్నారు.