Reading Time: < 1 minute
Israel Envoy Ruven Azar Says Us Iran Deal Compromises Israel Security Interests

అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందంపై ఇజ్రాయెల్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమం, ప్రాంతీయ ఉగ్రవాద సంస్థలకు అందిస్తున్న మద్దతు వంటి కీలక అంశాలు ఒప్పందంలో ప్రస్తావించకపోవడంతో తమ భద్రతా ప్రయోజనాలు దెబ్బతిన్నాయని భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ వ్యాఖ్యానించారు.

ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అమెరికా-ఇరాన్ ఒప్పందం కొన్ని కీలక భద్రతా అంశాలను పక్కన పెట్టిందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘బాలిస్టిక్ క్షిపణుల విషయంలో ఇజ్రాయెల్ ప్రయోజనాలు దెబ్బతిన్నాయి. ఇజ్రాయెల్‌కు ప్రధాన సవాలు ఇప్పటికీ ఇరాన్ క్షిపణి కార్యక్రమమే. అలాగే ఇరాన్ తన ప్రాక్సీ సంస్థలకు అందిస్తున్న మద్దతు కూడా తీవ్రమైన భద్రతా సమస్యగా మిగిలింది’’ అని అజార్ స్పష్టం చేశారు. ఇరాన్ మద్దతుతో పనిచేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హిజ్బుల్లా, హమాస్ వంటి సంస్థలను ప్రస్తావిస్తూ.. ఈ అంశాలను విస్మరించడం భవిష్యత్తులో మరిన్ని ఘర్షణలకు దారితీయవచ్చని హెచ్చరించారు.

అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం (MoU) అణు కార్యక్రమంపై దృష్టి సారించినప్పటికీ.. ఇరాన్ క్షిపణి సామర్థ్యాలు, ప్రాంతీయ ప్రభావాన్ని పెంచే చర్యలపై స్పష్టమైన నిబంధనలు లేకపోవడం ఇజ్రాయెల్‌లో ఆందోళనకు కారణమవుతోంది. ఇలాంటి కీలక భద్రతా అంశాలను పరిష్కరించకుండా శాంతి ఒప్పందాలు కుదుర్చుకోవడం భవిష్యత్తులో కొత్త సంక్షోభాలకు దారితీయవచ్చని రూవెన్ అజార్ అభిప్రాయపడ్డారు. అమెరికా-ఇరాన్ ఒప్పందంపై ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రభుత్వం పలు సందేహాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో రాయబారి తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.