
ప్రస్తుత ఐటీ రంగంలో ఉద్యోగాల కోత, ఆర్థిక మందగమనం నడుస్తున్న వేళ ఐఐటీ హైదరాబాద్ విద్యార్థి సరికొత్త రికార్డు సృష్టించాడు. 21 ఏళ్ల విద్యార్థి ఏకంగా రూ.2.5 కోట్ల వార్షిక ప్యాకేజీతో అంతర్జాతీయ ఆఫర్‌ను దక్కించుకున్నాడు. ఇన్‌స్టిట్యూట్ చరిత్రలోనే 2008లో ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు నమోదైన అత్యధిక ప్లేస్‌మెంట్ ప్యాకేజీ ఇదే కావడం విశేషం. ఐఐటీ హైదరాబాద్‌లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఎడ్వర్డ్ నాథన్ వర్గీస్ ఈ అరుదైన ఘనత సాధించాడు. హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగిన ఎడ్వర్డ్, ఆ తర్వాత బెంగళూరులో 7వ తరగతి నుండి 12వ తరగతి వరకు విద్యాభ్యాసం పూర్తి చేశాడు. తల్లిదండ్రులు ఇద్దరూ ఇంజనీర్లు కావడంతో చిన్నప్పటి నుంచే టెక్నాలజీపై ఉన్న ఆసక్తితో ఐఐటీ హైదరాబాద్‌లో సీటు సంపాదించాడు. చదువులోనే కాకుండా గ్లోబల్ లెవెల్ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్‌లోనూ ఎడ్వర్డ్ రాణించాడు.
ఇంటర్న్‌షిప్ టు కోట్ల ప్యాకేజీ:
నెదర్లాండ్స్‌కు చెందిన ప్రముఖ గ్లోబల్ క్వాంటిటేటివ్ ట్రేడింగ్ సంస్థ ఆప్టివర్ ఈ భారీ ఆఫర్‌ను అందించింది. ఎడ్వర్డ్ ఈ సంస్థలో రెండు నెలల పాటు సమ్మర్ ఇంటర్న్‌షిప్ చేశాడు. రెండు వారాల కఠినమైన శిక్షణ, ఆరు వారాల ప్రాజెక్ట్ వర్క్‌లో అతని ప్రతిభను చూసి ఫిదా అయిన కంపెనీ మేనేజ్‌మెంట్.. క్యాంపస్ ఇంటర్వ్యూల కంటే ముందే ప్రీ ప్లేస్‌మెంట్ ఆఫర్ రూపంలో ఈ భారీ ప్యాకేజీని ప్రకటించింది. ఈ సీజన్‌లో అతను ఇంటర్వ్యూ ఇచ్చిన మొదటి, ఏకైక కంపెనీ ఇదే కావడం అతని ప్రతిభకు అద్దం పడుతోంది. డిగ్రీ పూర్తి కాగానే ఈ ఏడాది జూలై నుండి నెదర్లాండ్స్ ఆఫీస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఎడ్వర్డ్ బాధ్యతలు చేపట్టనున్నాడు.
ఐఐటీ హైదరాబాద్ చరిత్రలోనే ఆల్‌టైమ్ రికార్డ్
ఐఐటీ హైదరాబాద్ ప్రారంభమైన 17 ఏళ్ల చరిత్రలో ఇంతవరకు ఎవరికీ ఒకే ఏడాది రూ.2.5 కోట్ల ప్యాకేజీ రాలేదు. గతంలో గరిష్టంగా రూ. 1.1 కోట్ల ప్యాకేజీ మాత్రమే రికార్డుగా ఉండేది. ఈసారి ఎడ్వర్డ్ సాధించిన విజయంతో పాటు ఐఐటీ హైదరాబాద్ ఓవరాల్ ప్లేస్‌మెంట్స్ సగటు ప్యాకేజీ కూడా గతేడాదితో పోలిస్తే రూ.20.8 లక్షల నుండి దాదాపు రూ. 36.2 లక్షలకు పెరిగింది. జాబ్ మార్కెట్ స్తబ్దుగా ఉన్నప్పటికీ, సరైన నైపుణ్యాలు, నిరంతర సాధన ఉంటే గ్లోబల్ కంపెనీలు బ్రహ్మరథం పడతాయని ఎడ్వర్డ్ నాథన్ వర్గీస్ నిరూపించాడు. ఈ ఘనత సాధించిన విద్యార్థిని ఐఐటీ హైదరాబాద్ యాజమాన్యంతో పాటు ప్రొఫెసర్లు, తోటి విద్యార్థులు అభినందనలతో ముంచెత్తుతున్నారు.