Reading Time: < 1 minute
Manoj Tiwary Questions Shubman Gill Gautam Gambhirs Batting Order Experiment Against Afghanistan

ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన రెండో వన్డేలో భారత జట్టు ప్రయోగాత్మకంగా తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఓపెనింగ్ స్థానాన్ని వదిలి మూడో స్థానంలో బ్యాటింగ్‌కు రావడం, యువ ఆటగాడు యశస్వి జైస్వాల్‌ను రోహిత్ శర్మతో కలిసి ఓపెనర్‌గా పంపించడం పట్ల మాజీ భారత క్రికెటర్ మనోజ్ తివారి తీవ్ర విమర్శలు గుప్పించాడు. ఈ నిర్ణయం భవిష్యత్తులో జట్టు యాజమాన్యానికి తలనొప్పిగా మారే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డాడు.

లక్నోలోని ఎకానా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. కేవలం 4 పరుగులకే ఔటయ్యాడు. అయితే మూడో స్థానంలో వచ్చిన శుభ్‌మన్ గిల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 110 బంతుల్లో 154 పరుగులు చేసి జట్టు భారీ స్కోరుకు ప్రధాన కారణమయ్యాడు. మరోవైపు రోహిత్ శర్మ 48 పరుగులతో రాణించాడు. ఈ నేపథ్యంలో క్రిక్‌బజ్ కార్యక్రమంలో మాట్లాడిన మనోజ్ తివారీ.. జట్టు మేనేజ్‌మెంట్ వ్యూహంపై ప్రశ్నలు లేవనెత్తాడు. ‘రోహిత్ శర్మ, జైస్వాల్‌తో ఓపెనింగ్ చేయించారు. గిల్‌ను మూడో స్థానానికి పంపడం వల్ల భవిష్యత్తులో గందరగోళం ఏర్పడుతుంది. ఇప్పుడు గిల్ ఆ స్థానంలో పరుగులు చేస్తే.. మళ్లీ ఓపెనర్‌గా వెళ్లాలా లేదా అనే సందేహం అతనిలో కలుగుతుంది. ఇది అవసరం లేని తలనొప్పిని సృష్టిస్తుంది’ అని వ్యాఖ్యానించాడు.

అంతేకాకుండా జట్టు మేనేజ్‌మెంట్ నిర్ణయాల్లో స్పష్టత కనిపించడం లేదని మనోజ్ తివారీ అభిప్రాయపడ్డాడు. ‘మేనేజ్‌మెంట్ అసలు ఏం చేయాలనుకుంటుందో నాకు అర్థం కావడం లేదు. ఇక్కడ స్పష్టత లోపం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే జైస్వాల్ అన్ని ఫార్మాట్లలో ఆడే అర్హత కలిగిన ఆటగాడు. అతనికి అవకాశాలు రావడం సంతోషకరం. కానీ రోహిత్ శర్మ విఫలమైతే బయట నుంచి మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది’ అని తెలిపాడు. భారత్ బ్యాటింగ్‌లో గిల్‌తో పాటు ఇషాన్ కిషన్ కూడా శతకంతో చెలరేగాడు. వీరి అద్భుత ప్రదర్శనతో భారత్ 49.5 ఓవర్లలో 402 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. అనంతరం 403 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ 44.3 ఓవర్లలో 232 పరుగులకు ఆలౌట్ అయింది.