
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో విషాదం చోటుచేసుకుంది. గుర్రపు బండిలో ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కిందపడిన తన తల్లిని కాపాడేందుకు ప్రయత్నించిన భారతీయ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో 18 ఏళ్ల రోమాంచ్ మహాజన్ మరణించాడు.
న్యూయార్క్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రం అయిన సెంట్రల్ పార్క్‌లో ఈ ప్రమాదం జరిగింది. కుటుంబ సభ్యులతో కలిసి తొలిసారి న్యూయార్క్‌కు వచ్చిన రోమాంచ్ మహాజన్ గుర్రపు బండిలో విహారయాత్రకు వెళ్లాడు. ఈ సందర్భంగా ఫొటో తీయడానికి డ్రైవర్ బండిని ఆపాడు. అయితే అకస్మాత్తుగా గుర్రం భయపడి అదుపుతప్పి పరుగులు పెట్టింది. గుర్రం వేగంగా పరుగులు తీయడంతో బండిలో ఉన్న కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ క్రమంలో రోమాంచ్ తల్లి ప్రియా మహాజన్ బండి నుంచి కిందపడిపోయింది. తల్లిని రక్షించేందుకు రోమాంచ్ వెంటనే బండి నుంచి దూకాడు. అయితే ఈ ప్రయత్నంలో అతడు నేలపై బలంగా పడటంతో తలకు తీవ్ర గాయమైంది.
రోమాంచ్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మరణించాడు. న్యూయార్క్-ప్రెస్బిటేరియన్ వైల్ కార్నెల్ మెడికల్ సెంటర్‌లో వైద్యులు అతడిని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ ప్రమాదంలో రోమాంచ్ తల్లిదండ్రులు, తమ్ముడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే అదుపుతప్పిన గుర్రపు బండి మరో బండిని ఢీకొని పల్టీలు కొట్టడంతో పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనపై స్పందించిన ప్రత్యక్ష సాక్షులు గుర్రం ఒక్కసారిగా భయపడి వేగంగా పరుగులు పెట్టిందని తెలిపారు. కొంతమంది స్థానికులు గుర్రాన్ని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారని చెప్పారు.
ఘటనపై విచారణ ప్రారంభించిన అధికారులు గుర్రపు బండి డ్రైవర్‌ను విధుల నుంచి నిరవధికంగా సస్పెండ్ చేశారు. డ్రైవర్ ఫొటోలు తీసేందుకు బండిని వదిలి వెళ్లడం నిబంధనలకు విరుద్ధమని సంబంధిత కార్మిక సంఘం పేర్కొంది. పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ ప్రమాదం నేపథ్యంలో సెంట్రల్ పార్క్‌లో గుర్రపు బండుల సేవలను పూర్తిగా నిషేధించాలని మరోసారి డిమాండ్లు వినిపిస్తున్నాయి. గత ఏడాదిన్నర కాలంలో పార్క్ పరిసరాల్లో గుర్రాలకు సంబంధించిన పలు ప్రమాదాలు చోటుచేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.