Reading Time: 2 minutes
Ap Aqua Farmers Get Relief As Feed Price Reduced By Rs 4 Following Cm Chandrababus Intervention

Aqua Feed Price Reduction: ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వా రైతులకు ప్రభుత్వం కీలక ఊరట కల్పించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో ఆక్వా ఫీడ్ ధరను కేజీకి రూ.4 మేర తగ్గించేందుకు ఫీడ్ తయారీ సంస్థలు అంగీకరించాయి. దీంతో ప్రస్తుతం కేజీకి రూ.112గా ఉన్న ఫీడ్ ధర రూ.108కు తగ్గనుంది. ఆక్వా రైతులు, ఫీడ్ తయారీ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆక్వా రంగంలో పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాల నేపథ్యంలో రైతులకు ఉపశమనం కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

ఇక, ఈ సమావేశంలో పాల్గొన్న ఆక్వా రైతులు ప్రభుత్వ చొరవపై హర్షం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని పేర్కొన్నారు. ఫీడ్ ధర తగ్గింపు నిర్ణయం రైతులకు ఎంతో ఊరటనిస్తుందని తెలిపారు. ధరల స్థిరీకరణ కోసం ఆక్వా రైతులు, ఫీడ్ తయారీదారులు, సంబంధిత అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ కమిటీ 20 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని సూచించారు. ఆ నివేదిక ఆధారంగా భవిష్యత్తులో ధరలపై తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఆక్వా సాగుకు యూనిట్ విద్యుత్‌ను రూ.1.50కే అందిస్తున్నందుకు రైతులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. గోదావరి జిల్లాలకు మాత్రమే పరిమితమైన ఆక్వా సాగును శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు విస్తరించేలా చేసిన ఘనత చంద్రబాబుదేనని రైతులు అభిప్రాయపడ్డారు. ఇక, గత ప్రభుత్వ హయాంలో ఫీడ్ ధరలు ఆరు సార్లు పెరిగినా, ధరల నియంత్రణపై చర్యలు తీసుకోలేదని రైతులు పేర్కొన్నారు. 2019లో కేజీ ఫీడ్ ధర రూ.87.80 ఉండగా, గత ప్రభుత్వ పాలన ముగిసే సమయానికి అది రూ.107.80కు చేరిందని వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే రూ.5.80 తగ్గించిందని, తాజాగా మరో రూ.4 తగ్గించడం రైతులకు మరింత లాభదాయకమని చెప్పారు.

రైతులు ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకుని అధిక లాభాలు పొందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. లక్షలాది మంది జీవనాధారంగా ఉన్న ఆక్వా రంగాన్ని పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యత అని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు, ఉన్నతాధికారులు, ఆక్వా రైతు సంఘాల ప్రతినిధులు, ఫీడ్ తయారీ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. రైతుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ప్రభుత్వం హామీ ఇచ్చింది.