
సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి జీవితకాల కల. అందుకే ఇల్లు కట్టేటప్పుడో లేదా కొనేటప్పుడో చాలా మంది వాస్తు నియమాలను ఖచ్చితంగా పాటిస్తారు. అయితే, వాస్తు విషయంలో రకరకాల వ్యక్తులు చెప్పే మాటల వల్ల చాలా మందిలో లేనిపోని అనుమానాలు, భయాలు మొదలవుతుంటాయి. ముఖ్యంగా వీధిపోట్లు, గుడి పరిసరాల్లో ఇళ్లు, అన్నదమ్ముల ఇళ్ల స్థలాల విషయంలో ఎన్నో సందేహాలు ఉంటాయి. అలాంటి కొన్ని ప్రాచుర్యంలో ఉన్న ముఖ్యమైన ప్రశ్నలకు, వాస్తు శాస్త్ర నియమాల ప్రకారం సరైన సమాధానాలు, వివరణలు ఇప్పుడు చూద్దాం…
ప్రశ్న : కొత్తగా ఇల్లు కట్టుకుని పై ఫ్లోర్లో ఉంటున్నాం. మా ఇంటికి ఈశాన్య వీధిపోటు ఉంది. తూర్పు వైపు ఇంటి తలుపు ఉంది. ఆ తలుపు నుంచి బయటికొచ్చి, దక్షిణంవైపు ఉన్న మెట్లమీది నుంచి కిందికి దిగి, ఉత్తరంవైపు నుంచి వెళ్తుంటాం. ఉత్తరం వైపు రోడ్డు ఉంది. ఇంట్లో వాస్తు దోషాలున్నాయంటున్నారు. నిజమేనా?
జవాబు: ఈశాన్య వీధిపోటు మంచిది. దక్షిణం వైపు మెట్లు ఉండటంలో దోషం ఏమీ లేదు. తూర్పు నుంచి పడమరకు లేదా ఉత్తరం నుంచి దక్షిణంవైపు మెట్లు ఎక్కితే మంచిది. యజమాని కింది ఫ్లోర్లో ఉంటే మరింత మంచి ఫలితాలు ఉంటాయి.
ప్రశ్న : దేవాలయం దగ్గర ఒక ఖాళీ స్థలం ఉంది. గుడి ఎదురుగా ఇల్లు కట్టొచ్చా ? ధ్వజస్తంభం కంటే ఎక్కువ ఎత్తులో ఇల్లు కట్టుకోవచ్చా?
జవాబు: దేవాలయానికి ఎదురుగా ఇల్లు కట్టుకో కూడదు. ముఖ్యంగా దేవాలయం నీడ, ధ్వజస్తంభం నీడ ఇంటిపై పడకూడదు. ధ్వజస్తంభం కంటే ఎక్కువ ఎత్తులో ఇల్లు కట్టుకోకపోవడమే మంచిది.
ప్రశ్న : తూర్పు వైపు రోడ్డుకు ఒక ఖాళీ స్థలం ఉంది. అన్నదమ్ములం ఇద్దరం అదే స్థలంలో చెరి సగం ప్లేస్లో వేరువేరుగా ఇళ్లు కట్టుకోవాలనుకుంటున్నాం. అయితే ఒకే చోట ఇల్లు కట్టుకుంటున్నాం. కాబట్టి మెయిన్ డోర్, కాంపౌండ్ వాల్ ఒకటే ఉండాలా. వేరువేరుగా కట్టుకోవాలా?
జవాబు: ఇద్దరూ ఒకే ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఒకటే మెయిన్ డోర్, కాంపౌండ్ వాల్ ఉండాలి. అలాకాకుండా, వేరువేరుగా కట్టుకున్నప్పుడు మెయిన్ డోర్, కాంపౌండ్ అన్నీ విడిగానే కట్టుకోవాలి.