Reading Time: 2 minutes

రూ.304కోట్ల ప్రాపర్టీని రూ.12వందల 60 కోట్లకు అమ్మిన ZEE టీవీ ఓనర్.. ఢిల్లీలో రికార్డ్

Caption of Image.

రియల్ ఎస్టేట్ అంటే ఏదో ప్లాట్లు కొని, నాలుగేళ్ల తర్వాత డబుల్ రేటుకు అమ్ముకోవడం అనుకుంటే పొరపాటే. అసలైన పవర్ గేమ్ ఎలా ఉంటుందో ఎస్సెల్ గ్రూప్ అదేనండి జీ మీడియా మాతృసంస్థ చైర్మన్ సుభాష్ చంద్ర చేసి చూపించారు. దేశ రాజధాని ఢిల్లీలో లగ్జరీకి కేరాఫ్ అడ్రస్ అయిన ‘ల్యుటెన్స్ జోన్’లో ఉన్న తన లగ్జరీ బంగళాను ఏకంగా రూ.1,260 కోట్లకు అమ్మేసి, దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో షేక్ క్రియేట్ చేశారు. దీంతో ఇది ఇటీవల కాలంలో జరిగిన అత్యంత ఖరీదైన ప్రాపర్టీ డీల్స్‌లో ఇది ఒకటిగా నిలిచింది.

పదేళ్లలో 4 రెట్లు లాభం..
ట్విస్ట్ ఏంటంటే.. సుభాష్ చంద్ర ఈ బంగళాను 2015లో కేవలం రూ.304 కోట్లకు కొన్నారు. కానీ సరిగ్గా 10 ఏళ్లు తిరిగేసరికి దాని వాల్యూ 4 రెట్లు పెరిగి రూ.1,260 కోట్లకు చేరింది. అంటే దాదాపు రూ.950 కోట్లు లాభం అన్నమాట. ఇలాంటి రిటర్న్స్ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందేగా మరి. కన్నాట్ ప్లేస్, ఇండియా గేట్‌కు అత్యంత సమీపంలో.. భగవాన్ దాస్ రోడ్‌లో దాదాపు 3 ఎకరాల విస్తీర్ణంలో ఈ భారీ బంగళా విస్తరించి ఉంది. అయితే దీన్ని కొనుగోలు చేసిన ఆ లక్కీ ఢిల్లీ బిజినెస్ ఫ్యామిలీ ఎవరనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ డీల్ డిసెంబర్ మొదటి వారానికల్లా పూర్తిగా క్లోజ్ కానుందట.

ల్యుటెన్స్ జోన్ అంటే ఆషామాషీ కాదు..
ఢిల్లీ గుండెకాయ లాంటి ఈ జోన్‌లో కేవలం 3వేల బంగళాలు మాత్రమే ఉంటాయి. ఇక్కడ ఇల్లు ఉందంటేనే అదొక పవర్, స్టేటస్ సింబల్. సుప్రీంకోర్టు జడ్జీలు, సీనియర్ ప్రభుత్వ అధికారులు, ఇంటర్నేషనల్ డిప్లొమాట్స్, దేశంలోని టాప్ మోస్ట్ ఇండస్ట్రియలిస్టులు మాత్రమే ఇక్కడ నివసిస్తారు. ఇక్కడ కొత్తగా కన్‌స్ట్రక్షన్స్ చేయడానికి కఠినమైన రూల్స్ ఉంటాయి. ల్యాండ్ అస్సలు దొరకదు కాబట్టే.. వీటికి ఈ రేంజ్ డిమాండ్.

కోవిడ్ తర్వాత ఢిల్లీలోని ల్యుటెన్స్ జోన్‌తో పాటు గుర్గావ్‌లోని ‘గోల్ఫ్ కోర్స్ రోడ్’ లగ్జరీ ప్రాపర్టీస్ సేల్స్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా గుర్గావ్‌లోని DLF ‘ది కామెలియాస్’, ‘ది డహ్లియాస్’ లాంటి అల్ట్రా-లగ్జరీ ప్రాజెక్టులలో అపార్ట్‌మెంట్లు కూడా ఇప్పుడు కోట్ల రూపాయల ప్రీమియం ధరలకు అమ్ముడవుతూ రియల్ ఎస్టేట్ క్రేజ్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తున్నాయి. మొత్తానికి సుభాష్ చంద్ర బంగళా సేల్ మాత్రం ‘రియల్’ ఎస్టేట్ హిస్టరీలోనే ఒక గోల్డెన్ చాప్టర్ అని చెప్పుకోవచ్చు అంటున్నారు నిపుణులు. 

©️ VIL Media Pvt Ltd.