Reading Time: 2 minutes
Water Indoor Plants Without Soil

5 Best Indoor Plants : ఈ రోజుల్లో ఇంట్లో మొక్కలు పెంచడం ఒక పెద్ద ట్రెండ్‌గా మారింది. ఇది ఇంటి అందాన్ని పెంచడమే కాకుండా, గాలిని శుద్ధి చేస్తుంది , మానసిక ఒత్తిడిని తగ్గించి మంచి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. ముఖ్యంగా నేటి యువతరం మట్టితో పని లేకుండా, కేవలం శుభ్రమైన నీటిని ఉపయోగించి మొక్కలను పెంచడానికి తెగ ఇష్టపడుతున్నారు. ఈ మోడ్రన్ పద్ధతినే ‘హైడ్రోపోనిక్స్’ అంటారు. మట్టి లేకపోవడం వల్ల ఇల్లు అస్సలు మురికి అవ్వదు, పైగా ఇంటికి ఒక లగ్జరీ లుక్ వస్తుంది. మరి నీటిలోనే చాలా సులభంగా పెరిగే ఆ మొక్కలేంటో ఇప్పుడు చూద్దాం.

1. మనీ ప్లాంట్ (Money Plant)

ఇంటికి అదృష్టాన్ని, సంపదను తెస్తుందని నమ్మే మనీ ప్లాంట్ అందరి ఇళ్లలో కామన్ గా కనిపిస్తుంది. దీనికి అస్సలు మట్టి అవసరం లేదు. ఒక పారదర్శక గాజు సీసా, ప్లాస్టిక్ జార్‌లో నీళ్లు పోసి ఇందులో ఉంచితే చాలు, చాలా వేగంగా పెరుగుతుంది. అయితే ఈ మొక్కపై నేరుగా ఎండ పడకూడదు. కిటికీ పక్కన ఉంచితే వచ్చే వెలుతురు దీనికి సరిపోతుంది. మనీ ప్లాంట్ నీటిలోనే అద్భుతంగా పెరుగుతుందని సైంటిఫిక్ రీసెర్చ్ కూడా చెబుతోంది.

2. లక్కీ బాంబూ (Lucky Bamboo)

వాస్తు , ఫెంగ్ షుయ్ ప్రకారం లక్కీ బాంబూను ఇంట్లో ఉంచుకోవడం చాలా అదృష్టం. ఒక అందమైన గాజు గిన్నెలో నీళ్లు పోసి, కొన్ని కలర్ రాళ్లు (స్టోన్స్) వేసి ఈ మొక్కను పెంచుకోవచ్చు. దీనికి అస్సలు ఎండ అవసరం లేదు. అందుకే దీనిని లివింగ్ రూమ్‌లో సెంటర్ టేబుల్ పైన లేదా ఆఫీస్ డెస్క్‌పై పెట్టుకోవడానికి ఇది బెస్ట్ ఆప్షన్. ఇది కూడా పూర్తిగా నీటిలోనే పెరిగే హైడ్రోపోనిక్ మొక్క.

3. స్పైడర్ ప్లాంట్ (Spider Plant)

రిబ్బన్ లాంటి అందమైన ఆకులతో ఉండే స్పైడర్ ప్లాంట్ ఇళ్లకు మంచి లుక్ ఇస్తుంది. ఈ మొక్కకు వచ్చే చిన్న చిన్న పిలకలను (లేత మొక్కలను) కత్తిరించి నీటిలో ఉంచితే చాలా వేగంగా వేర్లు వస్తాయి. కాకపోతే, మొక్క అడుగు భాగం మాత్రమే నీటిలో మునిగేలా చూసుకోవాలి , వారానికి ఒకసారి నీటిని మారుస్తూ ఉండాలి. ఇంటి లోపల ఉండే చెడు గాలిని శుద్ధి చేయడంలో ఈ మొక్క నెంబర్ వన్ అని చెప్పొచ్చు.

4. పోథోస్ (Pothos)

ఇది చూడటానికి ఫిలోడెండ్రాన్ మొక్క లాగే, గుండె ఆకారంలో ఉండే ఆకుపచ్చ లేదా పసుపు మచ్చల ఆకులతో భలే ముద్దగా ఉంటుంది. దీని కాండాలను కత్తిరించి నీటిలో వేస్తే చాలా ఈజీగా వేర్లు వచ్చేస్తాయి. ఈ తీగలు చాలా ఫాస్ట్‌గా ఎదుగుతాయి. ఎలాంటి వాతావరణాన్నైనా, తక్కువ కాంతినైనా తట్టుకుని బతకడం దీని స్పెషాలిటీ. కానీ డైరెక్ట్ ఎండలో పెడితే మాత్రం ఆకులు మాడిపోతాయి.

5. సింగోనియం, ఆరోహెడ్ (Syngonium)

బాణం ఆకారంలో ఉండే దీని ఆకులు చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉంటాయి. ఇంటి లోపల డెకరేషన్ కోసం ఈ మొక్కను ఎక్కువగా వాడుతుంటారు. రూమ్‌లో లైటింగ్ తక్కువగా ఉన్నా కూడా ఇది నీటిలోనే హ్యాపీగా పెరుగుతుంది. దీని అందమైన తీగలు మీ హాల్, బాల్కనీ లుక్‌ను పూర్తిగా మార్చేస్తాయి.

కాబట్టి, మట్టితో ఇల్లు పాడవుతుందనే టెన్షన్ లేకుండా ఈ మొక్కలను తెచ్చి ఒక మంచి గాజు సీసాలో నీళ్లు పోసి ఇప్పుడే మీ ఇంటిని డెకరేట్ చేసుకోండి..