ఉదయం నిద్ర లేవగానే కాళ్లు నేలపై పెట్టాలంటే ప్రాణం పోతున్నట్లు అనిపిస్తుందా? ముఖ్యంగా మడమ భాగంలో సూదులతో గుచ్చినట్లు తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నారా? ఎక్కువ సేపు కూర్చొని లేచినప్పుడు కూడా ఇదే ఇబ్బంది ఎదురవుతుంటే.. మీరు ‘మడమ శూల’ సమస్యతో బాధపడుతున్నారని అర్థం. దీనినే వైద్య భాషలో ‘ప్లాంటార్ ఫాసిటిస్ అంటారు. పాదాల కింద ఉండే కండరాలపై అధిక ఒత్తిడి పడటం వల్ల ఈ సమస్య వస్తుంది. అసలు ఈ నొప్పి రావడానికి వెనుక ఉన్న ముఖ్యమైన కారణాలను ఇప్పుడు చూద్దాం.
బరువు పెరగడం మరియు అధిక ఒత్తిడి: మన శరీర బరువు అంతా పాదాలపైనే పడుతుంది. అందుకే బరువు పెరిగినప్పుడు మడమలపై ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. సాధారణంగా బాడీ మాస్ ఇండెక్స్ (BMI) 22.1 కంటే ఎక్కువగా ఉన్నవారిలో ఈ మడమ నొప్పి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ.ఇక శరీరం లావుగా మారే కొద్దీ పాదాల కండరాలు ఆ బరువును మోయలేక వాపునకు గురవుతాయి.
అలసట మరియు నిరంతర అలవాట్లు: మీరు రోజంతా విపరీతంగా శ్రమించి, శరీరం బాగా అలసిపోయినప్పుడు కూడా మడమల్లో తీవ్రమైన నొప్పి రావచ్చు. అలాగే, ఉద్యోగం లేదా వ్యాపారంలో భాగంగా రోజూ గంటల తరబడి నిరంతరాయంగా నిలబడటం లేదా ఒకే చోట కూర్చోవడం వల్ల పాదాల కండరాల సాగుదల తగ్గిపోయి ఈ మడమ శూల సమస్యకు దారితీస్తుంది.

వయసు పెరగడం మరియు కండరాల బలహీనత: వయసు పైబడే కొద్దీ మన శరీరంలోని ఎముకలు, కండరాలు సహజంగానే బలహీనపడతాయి. కాళ్లలోని కండరాలు, నరాలు తమ బలాన్ని కోల్పోవడం వల్ల నడిచేటప్పుడు లేదా నిలబడేటప్పుడు మడమ భాగంలో తట్టుకోలేని నొప్పి పుడుతుంది. ఇక వయసుతో పాటు వచ్చే మార్పుల వల్ల ఈ ప్లాంటార్ ఫాసిటిస్ ప్రమాదం పెరుగుతుంది.
చెప్పులు లేకుండా నడవడం: చాలా మందికి ఇంట్లో లేదా బయట చెప్పులు లేకుండా నడిచే అలవాటు ఉంటుంది. గట్టి నేలపై, సిమెంట్ రోడ్లపై ఎలాంటి పాదరక్షలు లేకుండా నడవడం వల్ల అరికాళ్లపై, ముఖ్యంగా మడమలపై నేరుగా ఒత్తిడి పడుతుంది. ఇక ఇది పాదాల లోపలి పొరలను దెబ్బతీసి తీవ్రమైన నొప్పులను కలిగిస్తుంది.
బిగుతుగా ఉండే పాదరక్షల వాడకం: మనం వేసుకునే చెప్పులు లేదా బూట్లు కూడా ఈ నొప్పికి ఒక కారణం. చాలా బిగుతుగా ఉండే బూట్లు ధరించడం వల్ల పాదాల కండరాలు ఫ్రీగా కదలలేవు.ఇక దీనివల్ల కండరాలపై ఒత్తిడి పెరిగి ప్లాంటార్ ఫాసైటిస్ వచ్చే ముప్పు ఎక్కువవుతుంది. కాబట్టి పాదాలకు సౌకర్యంగా ఉండే మెత్తటి చెప్పులను ఎంచుకోవడం చాలా ముఖ్యం.
ఇక మడమ నొప్పి అనేది కేవలం ఒక సాధారణ నొప్పు లాంటిది కాదు, అది మన జీవనశైలిలోని లోపాలను సూచించే హెచ్చరిక. బరువును అదుపులో ఉంచుకోవడం, నడిచేటప్పుడు మంచి పాదరక్షలు వాడటం, పాదాలకు తగినంత విశ్రాంతి ఇవ్వడం ద్వారా ఈ మడమ శూల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందించబడింది. మడమ నొప్పి తీవ్రంగా ఉన్నా లేదా ఎక్కువ రోజులు వేధిస్తున్నా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించి సరైన సలహా, చికిత్స తీసుకోవడం మంచిది.
The post కాలు నేలపై పెట్టలేని నొప్పి! మడమ శూలం వెనుక అసలు కారణాలు appeared first on Manalokam – Latest Telugu News & Updates.