
లైసెన్స్ రెన్యూవల్ అంటేనే చాలా మందికి చుక్కలు కనిపిస్తాయి. అయితే ఆ ఇబ్బందులకు త్వరలోనే ముగింపు పలకాలని కేంద్రం భావిస్తోంది. ఇకపై 50 ఏళ్ల వయస్సు వరకు లైసెన్స్ చెల్లుబాటు అయ్యేలా నిబంధనలను సడలించే యోచనలో ఉంది. అదే సమయంలో ట్రాఫిక్ రూల్స్ పాటించని వారికి కఠినమైన నెగటివ్ పాయింట్స్ సిస్టమ్‌ను కూడా తీసుకురానుంది. భవిష్యత్తులో రాబోయే ఈ మార్పుల గురించి ఇప్పుడు వివరంగా చూద్దాం!
లైసెన్స్ రెన్యూవల్ ఇకపై..
ప్రస్తుతం భారతదేశంలో డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేసిన నాటి నుంచి 20 ఏళ్ల వరకు చెల్లుబాటులో ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ రెన్యూవల్ చేసుకోవాలి. దీనికోసం అవసరమైన డాక్యుమెంట్లు, మెడికల్ సర్టిఫికేట్లు సమర్పించడం, ఆర్టీవో ఆఫీసుల చుట్టూ తిరగడం డ్రైవర్లకు పెద్ద తలనొప్పిగా మారింది. దీన్ని సరళీకరించేందుకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఒక కీలక ప్రతిపాదనను పరిశీలిస్తోంది. దీని ప్రకారం, లైసెన్స్ గడువును దరఖాస్తుదారునికి 50 ఏళ్ల వయస్సు వచ్చే వరకు పొడిగించే అవకాశం ఉంది. దీనివల్ల రెన్యూవల్ ప్రక్రియల భారం గణనీయంగా తగ్గుతుంది.
ట్రాఫిక్ ఉల్లంఘనలపై నిఘా..
కేవలం లైసెన్స్ గడువు పెంపు మాత్రమే కాదు, రోడ్డు భద్రతను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం మరో కీలక ప్రతిపాదనపై కూడా చర్చిస్తోంది. అదే ‘నెగటివ్ పాయింట్స్ సిస్టమ్’. రోడ్డుపై పదేపదే ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే డ్రైవర్లకు నెగటివ్ పాయింట్లు కేటాయిస్తారు. ఒక నిర్దిష్ట పరిమితికి మించి పాయింట్లు పెరిగితే, వారి లైసెన్స్‌ను సస్పెండ్ చేయడం లేదా రద్దు చేయడం వంటి కఠిన చర్యలు తీసుకుంటారు. దీనివల్ల బాధ్యతారహితంగా వ్యవహరించే డ్రైవర్లను సులభంగా గుర్తించి నియంత్రించవచ్చని అధికారులు భావిస్తున్నారు.
అంతేకాకుండా, వాహన యాజమాన్య బదిలీలు మరియు పర్మిట్ రెన్యూవల్స్‌ను పూర్తిగా డిజిటలైజ్ చేయాలని కేంద్రం యోచిస్తోంది. దీనివల్ల పత్రాల భారం తగ్గి, ఆన్‌లైన్ ద్వారానే పనులు వేగంగా పూర్తవుతాయి. అయితే, లైసెన్స్ గడువు పెంపు వల్ల రాష్ట్రాల ఆదాయం తగ్గుతుందని కొందరు ఆందోళన చెందుతున్నారు. కానీ, ఆన్‌లైన్ ద్వారానే ఫీజులు వసూలు చేయవచ్చు.
కాబట్టి రాష్ట్రాల ఆదాయానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని అధికారులు స్పష్టం చేశారు. ఈ ప్రతిపాదనలు ఇంకా చర్చల దశలోనే ఉన్నాయని, అమలుకు సంబంధించి ఎటువంటి కాలపరిమితిని ఇంకా ప్రకటించలేదని అధికారులు వెల్లడించారు. భవిష్యత్తులో ఈ మార్పులు అమలులోకి వస్తే, దేశవ్యాప్తంగా డ్రైవర్లకు ఎంతో ఊరట లభిస్తుంది.