July 11, 2026

Tamil Nadu: ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం.. విజయ్‌ అభిమానుల్లో తీవ్ర ఆవేదన.. ఆత్మహత్యాయత్నం కలకలం

Tamil Nadu: ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం.. విజయ్‌ అభిమానుల్లో తీవ్ర ఆవేదన.. ఆత్మహత్యాయత్నం కలకలం
Reading Time: < 1 minute
Vijay Supporter Attempts Self Immolation Amid Delay In Tamil Nadu Government Formation

Tamil Nadu: తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ స్పష్టమైన మెజారిటీ సాధించలేకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటు ఆలస్యం అవుతోంది. ఈ పరిణామాలు విజయ్ అభిమానుల్లో తీవ్ర భావోద్వేగాలకు దారితీస్తున్నాయి. శనివారం జరగాల్సిన విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా రద్దు కావడంతో పార్టీ కార్యకర్తల్లో అసంతృప్తి మరింత పెరిగింది. ఇదే సమయంలో విజయ్‌కు మద్దతుగా ఉన్న ఓ అభిమాని ఆత్మాహుతికి యత్నించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

సుమారు 40 ఏళ్ల వయసున్న ఇసక్కియప్పన్ అనే వ్యక్తి తనకు తాను నిప్పంటించుకుని తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విజయ్ ముఖ్యమంత్రి కావడంలో జరుగుతున్న జాప్యంపై తీవ్ర ఆవేదనతోనే ఈ చర్యకు పాల్పడ్డాడని స్థానికులు చెబుతున్నారు. ఇదే వ్యక్తి గతంలో కూడా విజయ్ ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్షతో తన ముఖానికి 16 అడుగుల పొడవైన ‘వేల్’ (ఈటె)ను గుచ్చుకున్నట్లు సమాచారం. దీంతో అతని తీవ్ర అభిమాన భావోద్వేగాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి.

ఇక రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు అంశంపై ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. రాష్ట్ర ప్రజలు కొత్త ప్రభుత్వం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని, ఈ సమయంలో శాంతి భద్రతలు కాపాడటం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. విజయ్ తన అభిమానులకు, కార్యకర్తలకు శాంతిని పాటించాలని, ఎలాంటి ప్రమాదకర చర్యలకు పాల్పడవద్దని వెంటనే పిలుపునివ్వాలని తమిళిసై విజ్ఞప్తి చేశారు. రాజకీయ పరిస్థితులపై భావోద్వేగంతో స్పందిస్తున్న కార్యకర్తల పరిస్థితి ఆందోళన కలిగిస్తోందన్నారు.

ఇదిలా ఉండగా, వల్లియూర్ ప్రాంతంలో మరో యువకుడు కూడా ఆత్మాహుతికి యత్నించినట్లు వార్తలు వచ్చాయి. అలాగే వీసీకే కార్యాలయం వెలుపల ఓ యువకుడిపై బ్లేడుతో దాడి జరిగిన ఘటన కూడా ఉద్రిక్తతలకు దారితీసింది. అయితే, ప్రస్తుతం తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చుట్టూ నెలకొన్న రాజకీయ అనిశ్చితి, అభిమానుల భావోద్వేగాలు రాష్ట్ర రాజకీయాలను మరింత హీటెక్కుతున్నాయి..