Reading Time: 2 minutes
Rohit Sharma Waits For Female Fans Selfie Heartwarming Video Goes Viral

సాధారణంగా స్టార్ క్రికెటర్లు బయట కనిపిస్తే.. అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడుతుంటారు. బిజీ షెడ్యూల్, సెక్యూరిటీ రీజన్స్ కారణంగా చాలామంది ఆటగాళ్లకు ఎక్కువసేపు ఆగే అవకాశం ఉండదు. కానీ ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించాడు. ఓ మహిళా అభిమాని అతడితో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. అనుకోకుండా ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ అయింది. అయినా ఆమె కోసం వెయిట్ చేసి సెల్ఫీ ఇచ్చాడు.

ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ తరఫున రోహిత్ శర్మ ఆడుతున్న విషయం తెలిసిందే. గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లలో ఆడని హిట్‌మ్యాన్.. తాజాగా మైదానంలోకి దిగాడు. హోటల్ నుంచి టీమ్ బస్సులోకి వెళ్లే సమయంలో ఓ లేడీ సెల్ఫీ అడిగింది. సెక్యూరిటీ ఆపినా.. రోహిత్ చెప్పడంతో ఆమె ఎంతో సంతోషంగా హిట్‌మ్యాన్ దగ్గరికి వచ్చింది. అతడితో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. అనుకోకుండా ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ అయింది. దీంతో ఆ లేడీ ఫ్యాన్ ఒక్కసారిగా కంగారు పడింది. ఆమె మరో ఫోన్ కోసం ప్రయత్నిస్తుండగా.. ఇంతలో ఓ చిన్నారితో ఫోటో దిగాడు.

ఇక రోహిత్ శర్మ టీమ్ బస్సు వెళుతుండగా.. ఆ లేడీ అభిమాని పిలిచింది. డోర్ దగ్గర ఆగిన హిట్‌మ్యాన్.. ఆమెకు సెల్ఫీ ఇచ్చి వెళ్ళిపోయాడు. దాంతో ఆ అభిమాని సంతోషంగా వెళ్ళిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అభిమానులు ఎంతో ఓపికగా ఉన్న హిట్‌మ్యాన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘రోహిత్ గొప్ప ఆటగాడే కాదు.. అంతకంటే గొప్ప మనిషి’, ‘డౌన్ టు ఎర్త్ పర్సన్’, ‘ఫ్యాన్స్‌ను రోహిత్ ఎంత గౌరవిస్తాడో’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మైదానంలో ఎంత దూకుడుగా కనిపించినా.. బయట అభిమానులతో రోహిత్ చాలా సింపుల్‌గా, ఆప్యాయంగా ఉంటాడని ఈ సంఘటన మరోసారి నిరూపించింది.