E20 పెట్రోల్‌పై 9 అనుమానాలు ఇవే.. బైక్, కారు ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు..!

పెట్రోల్ బంక్‌కు వెళ్లిన ప్రతిసారి వెహికల్ ఓనర్ మదిలో ఇప్పుడు ఒకే ప్రశ్న.. “ఇది E20 పెట్రోల్ కదా.. నా బైక్ లేదా కారు మైలేజ్ తగ్గుతుందా? ఇంజిన్ పాడవుతుందా?” సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలు చూసిన చాలామంది యజమానులు అయోమయంలో ఉన్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా E20పై చర్చ మామూలుగా లేదు.
దేశవ్యాప్తంగా 20 శాతం ఇథనాల్ కలిపిన E20 పెట్రోల్ అమ్మకంపై కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ కీలక వివరణ ఇచ్చింది. E20 ఉద్దేశం కేవలం పెట్రోల్ ధర తగ్గించడం కాదని, క్రూడ్ దిగుమతులను తగ్గించడం, రైతులకు ఆదాయం పెంచడం, పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడం ప్రధాన లక్ష్యాలని తెలిపింది. సో అసలు ఇథనాల్ కలిపిన పెట్రోల్ పై ప్రజలకు ఉన్న ప్రశ్నలు వాటికి జవాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం రండి…
1. E20 పెట్రోల్ అంటే ఏమిటి? ఇది కొత్త ఇంధనమా?
జవాబు: E20 అంటే పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్, 80 శాతం పెట్రోల్ కలిసిన ఇంధనం. ఇది కొత్తగా వచ్చిన ప్రయోగం కాదు. అమెరికా, బ్రెజిల్ లాంటి దేశాలు దశాబ్దాలుగా ఇథనాల్ బ్లెండింగ్‌ను ఉపయోగిస్తున్నాయి. భారత్‌లో కూడా ఇథనాల్ కలిపిన పెట్రోల్ ప్రయాణం 20 ఏళ్ల క్రితమే ప్రారంభమైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో సాధారణ పెట్రోల్ స్థానంలో E20 అందుబాటులో ఉంది.
2. భారత్ ఇంత త్వరగా E20కి ఎలా మారింది?
జవాబు: భారత్‌లో ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం భారీగా పెరగడంతో ఈ మార్పు సాధ్యమైంది. 2020-21లో ఇథనాల్ బ్లెండింగ్ సుమారు 8 శాతంగా ఉండగా, 2021-22లో 10 శాతం, 2024-25లో దాదాపు 19 శాతానికి చేరుకుంది. 2025లోనే దేశం 20 శాతం లక్ష్యాన్ని చేరుకుంది.
3. పెట్రోల్ బంకుల్లో ప్యూర్ పెట్రోల్, E10, E20 మూడు రకాలుగా ఎందుకు విడివిడిగా అమ్మట్లే?
జవాబు: దేశవ్యాప్తంగా లక్షకు పైగా పెట్రోల్ బంకులు ఉన్నాయి. ప్రతి చోట 3 రకాల ఇంధనాలను ప్రత్యేకంగా నిల్వ చేయడం వల్ల ఖర్చులు, సరఫరా సమస్యలు పెరుగుతాయి. నాణ్యతను కాపాడటం కూడా కష్టమవుతుంది. అందుకే దేశవ్యాప్తంగా ఒకే విధమైన E20 పెట్రోల్ అమ్మేస్తోంది మోడీ సర్కార్.
4. E20 తీసుకురావడానికి ముందు వాహన కంపెనీలను సంప్రదించారా?
జవాబు: అవును.. E20పై ఆటోమొబైల్ కంపెనీలు, ARAI, చమురు సంస్థలు కలిసి పరీక్షలు నిర్వహించాయి. ఇంజిన్ పనితీరు, రబ్బర్ భాగాలు, ఇంధన వ్యవస్థ, కాలుష్య ఉద్గారాలు వంటి అంశాలను పరిశీలించిన తర్వాతే E20ను ప్రవేశపెట్టారు. వాహన కంపెనీలు కూడా తమ వాహనాలకు అనుగుణంగా మార్పులు చేశాయి.
5. E20 వల్ల మైలేజ్ తగ్గుతుందా?
జవాబు: కొన్ని వాహనాల్లో మైలేజ్ 3 నుంచి 5 శాతం వరకు తగ్గుతోందని కేంద్రం అంగీకరించింది. దీనికి కారణం ఇథనాల్‌లో పెట్రోల్ కంటే తక్కువ క్యాలరీ విలువ ఉండటం. అయితే డ్రైవింగ్ అలవాట్లు, టైర్ ప్రెజర్, సర్వీసింగ్, ఏసీ వినియోగం వంటి అంశాలు కూడా మైలేజ్‌పై ఎక్కువ ప్రభావం చూపుతాయి. అయితే E20కు అధిక ఆక్టేన్ విలువ ఉండటం వల్ల ఇంజిన్ పనితీరు మెరుగయ్యే ప్రయోజనం కూడా ఉంటోంది ప్రభుత్వం.
6. నా వాహనం మాన్యువల్‌లో E10 compatible అని ఉంది.. E20 వాడితే ప్రమాదమా?
జవాబు: కేవలం మాన్యువల్‌లో E10 అని ఉండటం వల్ల వాహనం వెంటనే ప్రమాదంలో పడుతుందని అర్థం కాదు. వాహన తయారీ ప్రమాణాలు తయారైన సమయంలో ఉన్న ఇంధన ప్రమాణాల ఆధారంగా ఉంటాయి. ఈ20కి అనుగుణంగా కొన్ని స్పేర్స్ మార్చుకోవటం మంచిది.
7. పాత కార్లు, బైకుల్లో E20 వల్ల ఇంజిన్ లేదా రబ్బర్ పార్ట్స్ దెబ్బతింటాయా?
జవాబు: ఇప్పటివరకు పెద్ద స్థాయిలో అలాంటి సమస్యలు కనిపించలేదని ప్రభుత్వం చెబుతోంది. కానీ పాత వాహనాల్లో ఇంధన వ్యవస్థకు సంబంధించిన కొన్ని భాగాలను సర్వీసింగ్ సమయంలో మార్చక తప్పదు.
8. ఇథనాల్ కలిపితే పెట్రోల్ ధర తగ్గాలి కదా.. మరి ఎందుకు తగ్గడం లేదు?
జవాబు: ఇదే చాలామంది అడుగుతున్న ప్రధాన ప్రశ్న. ఇథనాల్ ధర ప్రభుత్వం రైతులకు మంచి ఆదాయం వచ్చేలా నిర్ణయిస్తుంది. ప్రస్తుతం ఇథనాల్ కొనుగోలు ధర, రవాణా, నిల్వ ఖర్చులు కలిపితే E20 తయారీ వ్యయం సాధారణ పెట్రోల్ కంటే తక్కువ అవ్వట్లే. రేటు తగ్గించటం కంటే దిగుమతులు తగ్గించటమే ఫోకస్ అంశం.
9. E20 వల్ల దేశానికి, ప్రజలకు అసలు లాభం ఏమిటి?
జవాబు: ప్రతి లీటర్ పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ దేశీయంగా ఉత్పత్తి అవుతుంది. దీంతో క్రూడ్ ఆయిల్ దిగుమతులపై ఆధారం తగ్గుతుంది. రైతులకు ఆదాయం పెరుగుతుంది. కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగినా దాని ప్రభావం కొంతవరకు తగ్గుతుంది.
మొత్తానికి.. E20పై భయపడాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చెబుతోంది. ఇది చౌక పెట్రోల్ కోసం తీసుకున్న నిర్ణయం కాదు.. దేశ ఇంధన భద్రత కోసమే అంటోంది మోడీ సర్కార్.