
Udupi-style coconut chutney recipe (in Telugu): ఇడ్లీ, దోసెకి ఎప్పుడూ ఒక మంచి సైడ్ డిష్ కావాలి కదా. కానీ, ప్రతి సారి కొబ్బరి చట్నీ, టమాటా చట్నీ, కారపు చట్నీ చేసి బోర్ అనిపిస్తే.. కాస్త కొత్తగా ట్రై చేయడం మంచిదే. అటువంటి భిన్నమైన రుచితో ఉండే ఉడుపి స్టైల్ కొబ్బరి–కొత్తిమీర చట్నీని ఈసారి ప్రయత్నించండి. ఇది చూడటానికి సాధారణ కొబ్బరి చట్నీలా అనిపించినా, ఇందులో జీడిపప్పు, పుదీనా, వెల్లుల్లి వంటి పదార్థాలు కలవడం వల్ల ప్రత్యేకమైన ఫ్లేవర్ వస్తుంది. ఉడుపి, కర్ణాటక ప్రాంతాల్లో ఇది చాలా ప్రసిద్ధి చెందిన చట్నీ.
ఉడిపి స్టైల్ కొబ్బరి కొత్తిమీర చట్నీ
కావలసిన పదార్థాలు:
- తురిమిన కొబ్బరి – 1/2 కప్పు
- జీడిపప్పు – 1/4 కప్పు
- కొత్తిమీర – ఒక గుప్పెడు
- పుదీనా ఆకులు – 8–10
- పచ్చిమిరపకాయలు – 4–5
- వెల్లుల్లి రెబ్బలు – 4–5
- చిన్న అల్లం ముక్క – 1
- చిన్న చింతపండు ముక్క – కొద్దిగా
- ఉప్పు – రుచికి సరిపడా
- నీరు – అవసరమైనంత
తాలింపు (పోపు) కోసం:
- నూనె – 2 టేబుల్ స్పూన్లు
- ఆవాలు – 1/2 టీ స్పూన్
- మినపప్పు – 1 టీ స్పూన్
- ఎండు మిరపకాయ – 1
తయారీ విధానం:
- ముందుగా కొబ్బరిని తురిమి సిద్ధం చేసుకోండి. కొత్తిమీర, పుదీనా ఆకులను శుభ్రంగా కడిగి పెట్టండి. అల్లం తొక్క తీసి చిన్న ముక్కలుగా చేసుకోండి.
- ఒక మిక్సీ జార్‌లో కొబ్బరి, జీడిపప్పు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, అల్లం, చింతపండు, ఉప్పు వేసుకోండి.
- కొద్దిగా నీరు కలిపి మెత్తగా, స్మూత్ చట్నీలా గ్రైండ్ చేసుకోండి.
- ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని అవసరమైతే కొంచెం నీరు కలిపి కావాల్సిన గట్టితనం రాకుండా చేసుకోండి.
తాలింపు విధానం:
- ఒక చిన్న కడాయిలో నూనె వేడి చేయండి.
- నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు వేయండి. అవి చిటపటలాడిన తర్వాత మినపప్పు, ఎండు మిరపకాయ వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించండి.
- ఈ తాలింపును చట్నీపై వేసి బాగా కలపండి.
ఉడిపి స్టైల్ కొబ్బరి కొత్తిమీర చట్నీ రెడీ..
ఇప్పుడు మీ రుచికరమైన ఉడుపి స్టైల్ కొబ్బరి కొత్తిమీర చట్నీ రెడీ. ఇడ్లీ, దోసె, వడ లేదా ఉప్మాతో ఇది అద్భుతంగా ఉంటుంది. కాస్త కొత్తగా, ఫ్రెష్‌గా, వేరే రుచితో ట్రై చేయాలనుకుంటే ఇది తప్పకుండా ప్రయత్నించండి.