Reading Time: < 1 minute

అట్టహాసంగా టీజీ 20 లీగ్‌‌ ప్రారంభం

Caption of Image.

హైదరాబాద్‌‌, వెలుగు: తెలంగాణ క్రికెట్‌‌ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతూ.. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించే దిశగా తొలి అడుగు పడింది. హైదరాబాద్‌‌ క్రికెట్‌‌ అసోసియేషన్‌‌ ఆధ్వర్యంలోఉప్పల్‌‌ స్టేడియంలో టీజీ 20 లీగ్‌‌ అట్టహాసంగా మొదలైంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరై టోర్నీని అధికారికంగా ప్రారంభించారు. లీగ్‌‌ బ్రాండ్‌‌ అంబాసిడర్‌‌ విజయ్‌‌ దేవరకొండ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

డీజీపీ సీవీ ఆనంద్‌‌, హెచ్‌‌సీఏ సెక్రటరీ జీవన్‌‌ రెడ్డి, బీసీసీఐ ఎపెక్స్‌‌ కౌన్సిల్‌‌ మెంబర్‌‌ వి. చాముండేశ్వరీ నాథ్‌‌, టీజీ 20 లీగ్‌‌ గవర్నింగ్‌‌ కౌన్సిల్‌‌ చైర్మన్‌‌ ఆగం రావు, వీవీఎస్‌‌ లక్ష్మణ్‌‌, అంబటి రాయుడు, సిరాజ్‌‌ ఇందులో పాల్గొన్నారు. సంగీత దర్శకుడు తమన్ సంగీత విభావరితో వేడుకలు ప్రారంభమయ్యాయి. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, బాణా సంచా వెలుగులు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. టీజీ 20 లీగ్‌‌లో భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉందని విజయ్‌‌ దేవరకొండ అన్నారు.

‘గతంలో ఇంటర్నేషనల్‌‌ క్రికెట్‌‌లో హైదరాబాద్‌‌ నుంచి చాలా తక్కువ మంది ఉండేవాళ్లు. ఇక్కడి నుంచి వెళ్లిన లక్ష్మణ్‌‌ను చూసి గర్వించేవాళ్లం. నగరంలో ఇలాంటి లీగ్‌‌లు జరగడం వల్ల చాలా మందికి అవకాశాలు వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకుని పెద్ద స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నా’ అని విజయ్‌‌ వ్యాఖ్యానించాడు. ఈ లీగ్‌‌లో హైదరాబాద్‌‌, రంగారెడ్డి, వరంగల్‌‌, పాలమూర్‌‌, మెదక్‌‌, కరీంనగర్‌‌, ఖమ్మం, నల్గొండ జట్లు పాల్గొంటున్నాయి. 21 రోజుల పాటు 32 మ్యాచ్‌‌లు జరగనున్నాయి. విజేతకు కోటి రూపాయల నగదు అందజేయనున్నారు. వచ్చే నెల 12న ఫైనల్‌‌ మ్యాచ్‌‌ జరగనుంది. బీసీసీఐ నిబంధనలకు అనుగుణంగా, వారి ఆమోదంతోనే ఈ లీగ్‌‌ను  చైర్మన్ ఆగం రావు తెలిపారు.

©️ VIL Media Pvt Ltd.