Reading Time: < 1 minute
Chittoor Tragedy Family Of Four Dies By Suicide Leaves Atm Pin On Tv For Funeral

Family Suicide Case: భార్యకు సోకిన నయం కాని వ్యాధి ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆమె పడుతున్న నరకయాతనను చూడలేక, తమ తర్వాత పిల్లల భవిష్యత్తు ఏమవుతుందోనన్న ఆందోళనతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు తీసుకున్న హృదయవిదారక సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లాలో దిగుమసపల్లె పంచాయతీ బంగారెడ్డిల్లిలో దాము (30) అనే వ్యక్తి మేస్త్రి పని చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయన భార్య నిర్మల (25) గృహిణి. వీరికి ఎనిమిదో తరగతి చదువుతున్న కుమారుడు దిలీప్, ఆరో తరగతి చదువుతున్న కుమార్తె శ్రీవిద్య ఉన్నారు.

గత కొంతకాలంగా నిర్మల తీవ్రమైన మెదడు సంబంధిత (న్యూరో) వ్యాధితో బాధపడుతోంది. దాము తనకున్న స్థోమతలో పలు ఆసుపత్రుల చుట్టూ తిప్పినప్పటికీ, ఆమె కోలుకోవడం కష్టమని వైద్యులు చేతులెత్తేశారు. దీంతో ఆ కుటుంబం గత కొన్ని రోజులుగా తీవ్ర మనస్తాపంలో ఉంది. భార్య బాధను భరించలేక, పిల్లల దిక్కులేని వారని కుమిలిపోయిన దాము.. అందరితో కలిసి ప్రాణాలు వదలాలని ఘోర నిర్ణయం తీసుకున్నాడు. దాము తన భార్య నిర్మల, పిల్లలు దిలీప్, శ్రీవిద్యలకు ఆహారంలో విషం కలిపి ఇచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. విషం ప్రభావంతో వారు ముగ్గురు ప్రాణాలు విడిచినట్లు నిర్ధారించుకున్న తర్వాత.. దాము అదే ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం ఉదయం ఎంతసేపటికీ వారి ఇంటి తలుపులు తీయకపోవడంతో, అనుమానం వచ్చిన స్థానికులు కిటికీలోంచి చూసి షాక్‌కు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. సమాచారం అందుకున్న బీఎన్‌ఆర్‌ పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆత్మహత్యకు ముందు దాము ఇంట్లోని టీవీ స్క్రీన్‌పై రాసిన డెత్ నోట్ ప్రతి ఒక్కరి చేత కన్నీళ్లు పెట్టిస్తుంది. ఆ నోట్‌లో.. “మా చావుకు ఎవరూ కారణం కాదు. నా ఏటీఎం కార్డు నంబర్, దాని పిన్ నంబర్, నా ఫోన్ నంబర్ ఇవే.. నా బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బులతోనే మా నలుగురి దహన సంస్కారాలు పూర్తి చేయండి” అని రాసి ఉంది. చనిపోయే ముందు కూడా ఎవరికీ భారం కాకూడదనే ఉద్దేశంతో దాము తన బ్యాంక్ వివరాలను టీవీపై రాయడం చూసి ఘటనా స్థలానికి వచ్చిన కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.