రైల్వేశాఖ కఠిన నిబంధనలను అమల్లోకి తీసుకురానుంది. రైళ్లు, రైల్వే స్టేషన్లలో సేవలను మెరుగ్గా నిర్వహించేందుకు కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది. నిబంధనలను ఉల్లంఘించినవారికి భారీగా జరిమానాలు విధించాలని నిర్ణయించింది. ఇప్పటివరకు ఉన్న జరిమానాలను ఒకేసారి భారీగా పెంచింది. రైళ్లతో పాటు రైల్వే స్టేషన్ల వద్ద ప్రయాణికులకు భద్రత అందించడం, క్రమశిక్షణను మెరుగుపర్చడం, అక్రమ కార్యకలాపాలను నివారించేందుకు రైల్వే చట్టం 1989లో కేంద్రం కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది.
జన విశ్వాస్ పేరిట ఈ మార్పులు చేశారు. ఈ చట్టం ప్రకారం టికెట్ లేకుండా ప్రయాణం, వేరేవారి టికెట్‌పై ప్రయాణం, రైళ్లల్లో ధూమపానం, మద్యపానం, భిక్షాటన, రిజర్వ్ కోచ్‌లో అనధికారికంగా ప్రయాణించడం, ప్రమాదకర వస్తువులు తీసుకురావడం వంటి ఉల్లంఘనలకు జరిమానాలను పెంచింది. ఇప్పటివరకు టికెట్ లేకుండా ప్రయాణిస్తే కనీసం రూ.250 ఫైన్ విధించేవారు. కానీ ఇక నుంచి కనీసం రూ.500 కట్టాల్సి ఉంటుంది.
ఇక వేరేవారి టికెట్, అనుమతించిన దూరం కంటే ఎక్కవ దూరం ప్రయాణించేవారికి రూ.500 జరిమానాతో పాటు ప్రయాణ ఛార్జీలు విధిస్తారు. ఇక రైళ్లల్లో, రైల్వే స్టేషన్లలో అనుమతి లేకుండా తినుబండారాలు విక్రయించడం, భిక్షాటన చేయడం లాంటివి చేస్తే రూ.2 వేలు ఫైన్ వేస్తారు. ఇక రైల్వే ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించేవారికి రూ.2 వేల వరకు జరిమానా విధిస్తామని రైల్వేశాఖ స్పష్టం చేసింది.
ఇక రైల్వే ప్రాంగణంలో అనధికారిక ప్రవేశానికి రూ.500 జరిమానా ఉంటుందని రైల్వేశాఖ తెలిపింది. అలాగే రిజర్వ్ కోచ్‌లో అనధికారికంగా ప్రయాణిస్తే రూ.2 వేల జరిమానా నిర్ణయించగా.. రిజర్వ్ సీటు లేదా బెర్తును ఖాళీ చేయడానికి నిరాకరిస్తే రూ.వెయ్యి ఫైన్ ఉంటుంది. ఇక ట్రాఫిక్ సంకేతాలను ఉల్లంఘిస్తే రూ.500, మహిళల రిజర్వ్ కోచ్‌లోకి పురుషులు ప్రవేశిస్తే రూ.2,500 జరిమానా విధించనున్నారు.
ఇక ప్రమాదకర వస్తువులు తెస్తే రూ.10 వేలు, రైల్వే ప్రాంగణంలో లేదా రైళ్లలో ధూమపానం చేస్తే రూ.2 వేల జరిమానా నిర్ణయించారు. ఇక నుంచి స్పాట్లో జరిమానా వసూలు చేస్తారు. కట్టకపోతే పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తారు. దీంతో ప్రయాణికులందరూ ఈ కొత్త రూల్స్ గురించి తెలుసుకోవాలని రైల్వేశాఖ పేర్కొంది.




