Reading Time: 2 minutes

వరల్డ్ కప్‌లో ఆసక్తికర ఫలితాలు.. స్పెయిన్ దూకుడు, ఈజిప్ట్ జయభేరి, ఉరుగ్వేను వణికించిన కేప్ వర్డీ

Caption of Image.

FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచ కప్‌లో సంచలనాలు నమోదవుతున్నాయి. తొలిసారి ఈ మెగా టోర్నీలోకి దిగిన కేప్ వర్డీ.. రెండుసార్లు ఛాంపియన్ గా నిలిచిన ఉరుగ్వే జట్టుని నిలువరించింది. ఇక ఫిఫా ప్రపంచ కప్ చరిత్రలోనే ఈజిప్ట్ టీమ్ మొదటి విజయాన్ని రుచి చూసింది. అలాగే టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన స్పెయిన్‌కు తిరుగులేకుండా పోయింది. బెల్జియంను ఇరాన్ డ్రాతో సరిపెట్టింది.

ఉరుగ్వేకే షాకిచ్చిన కేప్ వర్డీ:  
ఆ దేశం మొత్తం జనాభా కేవలం 5.30 లక్షలే.. అయినప్పటికీ ఫిఫా ప్రపంచ కప్ బరిలోకి దిగి అదరగొట్టేసింది. వరుసగా రెండో మ్యాచ్‌నూ డ్రా చేసుకుని కేప్ వర్డీ సంచలన ప్రదర్శన చేసింది. గత మ్యాచ్‌లో ఒక్క గోల్ కూడా చేయని ఆ టీమ్.. ఈసారి మాత్రం రెండు గోల్స్ చేసేసింది. రెండు సార్లు ఛాంపియన్ గా నిలిచిన ఉరుగ్వేతో పోరును 2–2తో డ్రా చేసుకుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. కెవిన్ పినా 21వ నిమిషంలో తొలి గోల్ చేసి కేప్ వర్డీని ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. కానీ, ఉరుగ్వే ప్లేయర్లు మాక్సిమిలియనో (44వ నిమిషం), ఆగస్టిన్ కానోబ్బియో (45+6వ నిమిషం) చెరో గోల్ సాధించి ఆధిక్యంలోకి వెళ్లారు. కానీ, మ్యాచ్ ఉత్కంఠగా సాగుతున్న వేళ 61వ నిమిషంలో కేప్ వర్డీ ఆటగాడు హెలియో వారెలా గోల్‌తో స్కోర్లు సమమై, మ్యాచ్ చివరికి డ్రా అయింది. 

సౌదీపై స్పెయిన్ విక్టరీ: 
అర్జెంటీనా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్‌ జట్లతో పాటు ఈసారి కప్ కొట్టే టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన స్పెయిన్ టీమ్ మాత్రం ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తుంది. తొలి మ్యాచ్‌ను కేప్ వర్డీతో డ్రా చేసుకుని కాస్త నిరాశపరిచినప్పటికీ, ఈసారి మాత్రం సౌదీ అరేబియాపై దండయాత్ర చేసింది. సౌదీ డిఫెన్స్‌ను ముక్కలు చేస్తూ, 4–0 తేడాతో విక్టరీ కొట్టింది. స్పెయిన్ యువ సంచలనం లామినె యమాల్ 10వ నిమిషంలోనే గోల్స్ ఖాతా తెరవగా, మైకెల్ ఓయార్జాబల్ (21, 24వ నిమిషాలు) బ్యాక్-టు-బ్యాక్ గోల్స్‌తో చెలరేగిపోయాడు. ఆ తర్వాత 49వ నిమిషంలో హసన్ అల్తాంబక్తి కూడా గోల్ కొట్టడంతో సౌదీ ఆట ముగిసింది. ఈ మ్యాచ్‌లో సౌదీ అరేబియా జట్టు స్పెయిన్ గోల్ పోస్ట్ వైపు కేవలం ఒక్కటంటే ఒక్కసారి మాత్రమే టార్గెట్ చేసింది. 

బెల్జియంకు ఇరాన్ షాక్: 
అమెరికా గడ్డపై జరుగుతున్న ఫిఫా ప్రపంచ కప్‌లో ఇరాన్ ఫుట్‌బాల్ టీమ్ ఊహించని రేంజ్‌లో దూసుకుపోతోంది. టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఒక్కటి కూడా ఓడిపోలేదు. మొన్న న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌ను 2–2తో డ్రా చేసుకున్న ఇరాన్, ఇప్పుడు పవర్‌ఫుల్ బెల్జియంకు కూడా చుక్కలు చూపించింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో ఏ జట్టు కూడా గోల్ కొట్టలేకపోవడంతో 0–0తో మ్యాచ్ డ్రాగా ముగిసింది. బెల్జియం టీమ్ ఏకంగా ఏడుసార్లు ఇరాన్ గోల్ పోస్ట్ వైపు దూసుకెళ్లినప్పటికీ ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. దానికి కారణం ఇరాన్ గోల్‌కీపర్ గోడలా అడ్డు నిలవడమే. 

హిస్టరీ క్రియేట్ చేసిన ఈజిప్ట్: 
న్యూజిలాండ్, ఈజిప్ట్ మధ్య జరిగిన మ్యాచ్ మాత్రం సినిమాను తలపించింది. మ్యాచ్ ప్రారంభమైన 15వ నిమిషానికే న్యూజిలాండ్ గోల్ కొట్టి లీడ్‌లోకి దూసుకెళ్లడంతో ఫస్ట్ హాఫ్ మొత్తం ఆ జట్టుదే హవా కొనసాగింది. కానీ, సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక ఈజిప్ట్ ప్లేయర్లు పూనకాలు వచ్చినట్లు అటాకింగ్ గేమ్ ఆడారు. న్యూజిలాండ్ డిఫెన్స్‌ను ఊచకోత కోస్తూ గోల్స్ వర్షం కురిపించారు. ఆట 58వ నిమిషంలో మోస్తాఫా క్లాస్ గోల్ కొట్టగా, 67వ నిమిషంలో స్టార్ ప్లేయర్ మొహమ్మద్ సలాహ్ తన రేంజ్ ఏంటో చూపిస్తూ మరో గోల్ వేసేశాడు. ఇక 82వ నిమిషంలో ట్రెజెగ్యుట్ అదిరిపోయే గోల్ కొట్టడంతో ఈజిప్ట్ 3–1 తేడాతో గెలిచింది. ఈ విజయంతో ఫిఫా ప్రపంచ కప్ చరిత్రలోనే ఈజిప్ట్ తన మొట్టమొదటి  విజయాన్ని నమోదు చేసుకుంది. 
 

©️ VIL Media Pvt Ltd.