Reading Time: 2 minutes
Andhra Pradesh: ఏపీలో మరో కొత్త పథకం.. అకౌంట్లోకి నేరుగా రూ.25 వేలు.. ప్రారంభంపై ప్రభుత్వం అప్డేట్..

ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో పథకం అమలుకు సిద్దమైంది. గత ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఈ క్రమంలో మరో నూతన పథకాన్ని ప్రారంభించేందకు సిద్దమైంది. అదే నేతన్నకు భరోసా. త్వరలోనే ఈ పథకాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ విషయాన్ని ఏపీ చేనేత, జౌళిశాఖ మంత్రి సవిత అధికారికంగా ప్రకటించారు. ఈ స్కీమ్ కింద నేతన్నలకు ప్రతీ ఏడాది రూ.25 వేల ఆర్ధిక సాయం అందించనున్నారు. ప్రతీ నేతన్న కుటుంబానికి వీటిని నేరుగా అకౌంట్లలో జమ చేయనున్నారు. త్వరలోనే ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించనున్నట్లు సవిత వెల్లడించారు. అలాగే చేనేత కార్మికులకు ఆరోగ్య బీమా పథకం కూడా అమలు చేయనున్నట్లు ప్రకటించారు.

ఏపీలో నిఫ్ట్ కేంద్రం

అటు అమరావతిలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్) ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని, త్వరలోనే ఆమోదం లభిస్తుందని సవిత తెలిపారు. ఇక అమరావతిలో హస్తకళల మ్యూజియం ఏర్పాటుపై కేంద్రానికి ప్రతిపాదనలు పంపామన్నారు. కూటమి ప్రభుత్వం ఆధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత కార్మికుల ఉపాధి మెరుగయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని, ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటున్నామన్నారు. చేనేతకు అండగా నిలిచేలా వారంలో ఒక రోజు చేనేత వస్త్రాలను ప్రతి ఒక్కరూ ధరించాలని ఆమె సూచించారు. చేనేతలకు 365 రోజుల పాటు ఉపాధి లభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ధర్మవరంలో రూ.38 కోట్లతో మెగా చేనేత క్లస్టర్‌‌ కేంద్రం మంజూరు చేయగా.. దీని ద్వారా 10 వేల మంది లబ్ది చేకూరుతుందని అన్నారు. త్వరలో దీనికి శంకుస్థాపన జరగనుంది. అటు మంగళగిరిలో రూ.22 కోట్లతో, పిఠాపురంలో రూ.15 కోట్లతో చేనేత పార్క్ ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. ఇక మరో 10 చిన్న తరహా క్లస్టర్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వివరించారు.

90 శాతం రాయితీతో మగ్గాలు

ఇక చేనేతలకు 90 శాతం రాయితీతో ఆధునిక మగ్గాలను అందిస్తున్నామని, లాగే చేనేత వస్త్రాలు, హస్తకళ వస్తువులు ఒకేచోట విక్రయించేలా షోరూంలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సవిత స్పష్టం చేశారు. చేనేత, జౌళి శాఖలో రెండేళ్ల ప్రగతిపై మీడియాతో సవిత మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశారు. నేతనన్నకు భరోసా పథకం గురించి వివరాలు వెల్లడించారు. దీంతో త్వరలోనే ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించనుందని తెలుస్తోంది. దీంతో నేతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.