Reading Time: < 1 minute

బుగ్గపాడు ఫుడ్ పార్క్‌‌‌‌పై శ్వేతపత్రం విడుదల చేయాలి

Caption of Image.
  •     బీజేపీ జాతీయ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి 
  •     ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రాజెక్టులపై సీఎంకు లేఖ 

హైదరాబాద్, వెలుగు: ఖమ్మం జిల్లాలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులు, ముఖ్యంగా బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ పురోగతిపై శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ జాతీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల సమక్షంలో ఖమ్మం అభివృద్ధిపై వెంటనే ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించాలని కోరారు. ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన కింద కేంద్రం బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ కోసం రూ.50 కోట్లు మంజూరు చేసిందని పొంగులేటి గుర్తు చేశారు. 

గతేడాది డిసెంబర్‌‌‌‌లో జరిగిన సమీక్షలో ఓ  ప్రైవేట్ సంస్థ రూ.615 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించిందని, కానీ ఆ కంపెనీ వార్షిక టర్నోవర్ కేవలం రూ.22 కోట్లు మాత్రమే ఉండడంపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. కేవలం ఫుడ్ పార్క్ మాత్రమే కాకుండా, జిల్లాలోని జాతీయ రహదారులు, గ్రామీణ రోడ్లు, రైల్వేలు, గృహ నిర్మాణ పథకాలు, తాగునీరు, సాగునీటి ప్రాజెక్టులు, విద్యా, వైద్య రంగాలపై సమగ్ర సమీక్ష జరపాలని పొంగులేటి విజ్ఞప్తి చేశారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో సమన్వయం చేసుకుంటామన్న ముఖ్యమంత్రి నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. 

©️ VIL Media Pvt Ltd.