Reading Time: < 1 minute
Thoothukudi Storm Chaos Powerful Windstorm Causes Massive Damage Six Tourists Injured In Tamil Nadu

Thoothukudi Storm: తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో అరుదైన సుడిగాలి విరుచుకుపడి భారీ విధ్వంసాన్ని సృష్టించింది. ఆకస్మికంగా ఏర్పడిన ఈ ఘటనతో వాగైకుళం టోల్ ప్లాజా, ఓ ప్రైవేట్ థీమ్ పార్క్‌తో పాటు పలు ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆ సుడిగాలికి సంబంధించి గాలి వేగం గంటకు 180 – 200 కిలోమీటర్ల వరకు నమోదై ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

సుడిగాలి ప్రభావంతో ప్రైవేట్ థీమ్ పార్క్‌ లోని రేకులు, ఇతర నిర్మాణ సామగ్రి గాల్లోకి ఎగిరిపడి అక్కడ విహారానికి వచ్చిన ఆరుగురు పర్యాటకులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే తూత్తుకుడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. అలాగే జాతీయ రహదారిపై పలు విద్యుత్ స్తంభాలు విరిగిపడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తూత్తుకుడి విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో చెట్లు, బారికేడ్లు నేలకూలడంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. అధికారులు సహాయక చర్యలు చేపట్టి పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల ఆధారంగా చాలామంది దీనిని టోర్నడోగా భావించారు. అయితే భారత వాతావరణ శాఖ ఈ ప్రచారాన్ని ఖండించింది. ఇది టోర్నడో కాదని, ఉరుములు, మెరుపులతో కూడిన థండర్‌ స్టార్మ్ సమయంలో ఏర్పడే శక్తివంతమైన అప్‌ డ్రాఫ్ట్ ప్రభావమేనని స్పష్టం చేసింది. కుములోనింబస్ మేఘాల తీవ్ర అభివృద్ధి కారణంగా ఈ అరుదైన వాతావరణ పరిస్థితి ఏర్పడిందని వాతావరణ నిపుణులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన భయానక దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతూ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.