
నెలకు ముప్పై, నలభై వేలు సంపాదించేవారే జీతం చాలడం లేదు మహాప్రభో అని అంటుంటారు. అలాంటిది నెలకు ఏకంగా రూ.లక్షలకు లక్షలు జీతం చేతికి వస్తున్నా.. పైసా మిగలడం లేదని, భవిష్యత్తు తలుచుకుంటే వణుకు పుడుతోందని ఓ బెంగళూరు ఐటీ ఉద్యోగి పెట్టిన పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. వినడానికి షాకింగ్‌గా ఉన్నా.. ఇది అక్షరాలా నిజం. బెంగళూరుకు చెందిన 34 ఏళ్ల ఓ టెక్కీ తన ఖర్చుల చిట్టాను రెడ్డిట్ లో షేర్ చేస్తూ పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఏడాదికి రూ.96 లక్షల ప్యాకేజీ ఉన్నా కూడా నెలవారీ ఖర్చులు ముంచేస్తున్నాయంటూ అతడు రాసుకొచ్చిన స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
తనకు నాలుగేళ్ల ట్విన్స్ ఉన్నారని, ట్యాక్స్‌లు అన్నీ పోను నెలకు రూ.3 లక్షల 50వేలు బేస్ శాలరీ వస్తుందని ఆ టెక్కీ వివరించాడు. మిగిలిన రూ.35 లక్షలు స్టార్టప్ కంపెనీకి చెందిన ఈసోప్స్ రూపంలో ఉన్నందున వాటిని లెక్కలోకి తీసుకోవడం లేదన్నాడు. ఇంత సంపాదిస్తున్నా నెలకి కేవలం రూ.45 వేల నుండి రూ.50 వేలు మాత్రమే మిగులుతున్నాయని ఆందోళన చెందాడు. తన నెలవారీ ఖర్చుల వివరాలను చూపిస్తూ.. హోమ్ లోన్ ఈఎంఐ రూ.80వేలు, కార్ లోన్ రూ.30వేలు, కవల పిల్లల కోసం డేకేర్, ప్రిస్కూల్ ఫీజుల కోసమే నెలకు రూ.50వేలు అవుతోందని చెప్పాడు. వీటికి తోడు పిల్లల కేర్ టేకర్ కోసం జీతం రూ.40వేలు, వంటమనిషికి రూ.6వేలు, కిరాణా సామాన్లకు రూ.20వేలు, జిమ్ ఖర్చులు రూ.8వేలు, కరెంట్, గ్యాస్ వంటి వాటికి రూ.15వేలు, ప్రయాణాలకు మరో రూ.40వేల వరకూ ఖర్చవుతున్నట్లు లెక్కలు చూపించాడు.
ప్రస్తుతం తన నెట్ వర్త్ రూ.3 కోట్లు ఉన్నప్పటికీ.. గత కొన్నేళ్లుగా డబ్బు సేవింగ్స్ పెరగడం లేదని వాపోయాడు. ఆఫీస్ పనితో తీవ్రమైన అలసట ఎదుర్కొంటున్నానని, ఒక మంచి బ్రేక్ తీసుకుందామన్నా ఈ భారీ ఖర్చులు చూసి భయమేస్తోందని అన్నాడు. ఒకవేళ పొరపాటున రేపు ఉద్యోగం పోతే తన పరిస్థితి ఏంటోనని నిరంతరం ఆందోళనతో బతుకుతున్నట్లు అతడు పేర్కొన్నాడు.
ALSO READ : భూమి మీద ఇండియన్ టెక్కీల కంటే చీప్ లేబర్ ఇంకెవ్వరూ ఉండరు..
ఈ రెడ్డిట్ పోస్ట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు “నువ్వు కట్టే హోమ్ లోన్ ఈఎంఐ కూడా ఒక రకమైన స్థిరాస్తి పెట్టుబడే కదా, అంత కంగారు పడకు” అని సలహాలు ఇస్తుండగా.. మరికొందరు మీ అమ్మనాన్నలను బెంగళూరుకు రప్పించుకుంటే నానీ, డేకేర్ ఖర్చులు చాలా వరకు కలిసివస్తాయని ఐడియాలు ఇస్తున్నారు. అయితే మరికొందరు నెటిజన్లు మాత్రం ఈ పోస్ట్‌పై తీవ్రంగా స్పందిస్తూ.. నెలకు మూడున్నర లక్షల శాలరీ వస్తూ, రూ.3 కోట్ల ఆస్తి ఉన్న టెక్కీలే జాబ్ పోతే బతకలేనని ఇంతలా భయపడుతుంటే.. ఇక సాధారణ చిన్న ఉద్యోగుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇంత సంపాదిస్తూ కూడా లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ మాయలో పడి చేతులారా ఒత్తిడి తెచ్చుకుంటున్నారని.. రేపు పొరపాటున లేఆఫ్స్ వస్తే ఇలాంటి వారి పరిస్థితి నిజంగానే దారుణంగా ఉంటుందని కామెంట్లు పెడుతున్నారు.