Reading Time: 2 minutes
IND vs SA :  హిస్టరీ రిపీట్ అవుతోంది.. హర్మన్‌ప్రీత్ సేనకు రూట్ క్లియర్ చేసిన సంచలన ‘సౌతాఫ్రికా’ లక్

IND vs SA : ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026లో హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత మహిళల జట్టు పాకిస్తాన్, నెదర్లాండ్స్‌లపై ఘన విజయాలతో టోర్నీని అద్భుతంగా ప్రారంభించింది. అయితే మూడో లీగ్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో 6 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. ఈ ఓటమితో పాయింట్ల పట్టికలో భారత్ స్థానం దిగజారడమే కాకుండా సెమీస్ చేరడం కష్టంగా మారింది. కానీ క్రికెట్ చరిత్రలోని కొన్ని ఆసక్తికరమైన గణాంకాలను పరిశీలిస్తే, ఈ ఓటమి భారత్‌కు రాబోయే లక్‌కు సంకేతంగా మారుతోంది. గత మూడు పెద్ద ఐసీసీ ఈవెంట్లలో సౌతాఫ్రికాతో ఎదురైన ఓటములు భారత్‌కు చివరికి ట్రోఫీలను తెచ్చిపెట్టాయి.

ఉమెన్స్ వరల్డ్ కప్ 2025లో సరిగ్గా ఇదే సీన్

భారత మహిళల జట్టు గతేడాది (2025) వరల్డ్ కప్ గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ టోర్నమెంట్‌లో కూడా భారత జట్టు శ్రీలంక, పాకిస్తాన్‌లను ఓడించి జైత్రయాత్ర ప్రారంభించింది. కానీ మూడో మ్యాచ్‌కు వచ్చేసరికి సౌతాఫ్రికా జట్టు 3 వికెట్ల తేడాతో భారత్‌కు షాక్ ఇచ్చింది. టోర్నీలో భారత్‌కు అదే మొదటి ఓటమి. అయితే ఆ తర్వాత పుంజుకున్న హర్మన్‌ప్రీత్ సేన వరుస విజయాలతో దూసుకెళ్లి, ఫైనల్లో అదే సౌతాఫ్రికాను చిత్తు చేసి మరి ప్రపంచ కప్‌ను కైవసం చేసుకుంది.

మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 లోనూ ఇదే మ్యాజిక్

ఇటీవల ముగిసిన 2026 పురుషుల టీ20 వరల్డ్ కప్‌లోనూ సరిగ్గా ఇలాంటి విచిత్రమైన మ్యాజిక్ కనిపించింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోని భారత జట్టు టోర్నీలో వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచింది. అందులో పాకిస్తాన్‌పై సాధించిన విజయం కూడా ఉంది. అయితే ఐదో మ్యాచ్‌లో సౌతాఫ్రికా జట్టు భారత్‌ను ఓడించి టోర్నీలో మొదటి ఓటమి రుచి చూపించింది. ఆ తర్వాత భారత పురుషుల జట్టు అజేయంగా దూసుకెళ్లి, ఫైనల్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల భారీ తేడాతో ఓడించి విశ్వవిజేతగా నిలిచింది.

2011 నాటి ధోనీ సెంటిమెంట్ బోనస్

ఈ విచిత్రమైన ఆఫ్రికా ఓటమి సెంటిమెంట్ ఈనాటిది కాదు.. 2011 వన్డే వరల్డ్ కప్‌లో కూడా ఇదే రిపీట్ అయింది. లెజెండరీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ సారథ్యంలో బరిలోకి దిగిన టీమిండియా మొదటి నాలుగు మ్యాచ్‌లలో మూడింటిని గెలిచింది, ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్ టై అయింది. ఆ తర్వాత ఐదో మ్యాచ్‌లో సౌతాఫ్రికా జట్టుతో తలపడిన భారత్, టోర్నమెంట్‌లో తన మొదటి ఓటమిని నమోదు చేసింది. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే.. ముంబైలోని వాంఖడే స్టేడియంలో శ్రీలంకను ఓడించి ధోనీ సేన వరల్డ్ కప్ ట్రోఫీని గాల్లోకి లేపింది. ఇప్పుడు 2026 మహిళల వరల్డ్ కప్‌లో కూడా మొదటి ఓటమి ఆఫ్రికా చేతిలోనే రావడంతో, ఈసారి కూడా మన అమ్మాయిలే కప్ కొడతారని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి