Reading Time: < 1 minute

దొరల, పటేళ్ల, అగ్రకులాల పాలనకు అంతం..రాష్ట్రంలో వచ్చేది బీసీల రాజ్యమే: జాజుల శ్రీనివాస్ గౌడ్

Caption of Image.

సైఫాబాద్, వెలుగు : రాష్ట్రంలో దొరల, పటేళ్ల పాలనను దించి , బీసీల పాలనకు శ్రీకారం చుట్టబోతున్నామని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బీసీల త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ రాష్ట్రంలో అగ్రకులాలు రాజ్యం ఏలుతున్నాయని విమర్శించారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా సైఫాబాద్‌‌‌‌లోని బీసీ జేఏసీ భవన్‌‌‌‌లో ఆయన చిత్రపటానికి జేఏసీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాజుల మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనలో త్యాగాలు బీసీలవైతే , భోగాలు అగ్రకులాలు అనుభవిస్తున్నారని మండిపడ్డారు. 

తెలంగాణ రాష్ట్రం కోసం మంత్రి పదవికి మొదట రాజీనామా చేసింది బీసీ బిడ్డ అయిన కొండా లక్ష్మణ్ బాపూజీ అని, ఆత్మబలిదానాలతో పాటు ఉద్యమాన్ని ముందుండి నడిపింది బీసీలే అని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీసీలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. బీసీలను చైతన్యం చేసేందుకు జులై 1 నుంచి 31 వరకు… ‘దొరల, పటేళ్ల తెలంగాణ హఠావో.. బీసీ సీఎం బనవో’ అనే నినాదంతో సామాజిక తెలంగాణ ఏజెండగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తామని జాజుల స్పష్టం చేశారు.ఈ సమావేశంలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, కో చైర్మన్ కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ జేఏసీ నాయకులు గూడూరు భాస్కర్ మేరు, మాదేశి రాజేందర్, సంధ్యారాణి, గోదా వరుణ్ కుమార్, గుంటి మహేశ్‌‌‌‌ మేరు, సత్య గౌడ్, కిరణ్, నరేశ్‌‌‌‌, రేణుక, బండి గారి రాజు గౌడ్, జాజుల భాస్కర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.