
హైదరాబాద్, వెలుగు: ఇంగ్లిష్ భాషలో నైపుణ్యాలను పెంపొందించుకోవాలనుకునే వారికి బెంగళూరులోని ప్రాంతీయ ఆంగ్ల భాషా సంస్థ (ఆర్ఐఈఎస్ఐ) మంచి అవకాశం కల్పిస్తోంది. 2026–-27 విద్యా సంవత్సరానికి గానూ దూరవిద్య పద్ధతిలో వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ జి. రమేశ్.. డీఈఓలకు ఉత్తర్వులు జారీచేశారు. ఈ అకాడమిక్ ఇయర్‌లో ఆర్‌ఐఈఎస్‌ఐ ప్రధానంగా రెండు కోర్సులను ఆఫర్ చేస్తోంది. ఇందులో డిప్లొమా ఇన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్, పీజీ డిప్లొమా ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ కోర్సులు ఉన్నాయి.
ఇంగ్లీష్‌లో మాట్లాడే నైపుణ్యంతో పాటు, బోధనా పద్ధతుల్లో మెళకువలు నేర్చుకోవాలనుకునే టీచర్లు, విద్యార్థులు, ఇతర అభ్యర్థులు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల30వ తేదీ వరకు గడువు ఉందని, మరిన్ని వివరాలకు వెబ్‌సైట్ www.riesi.ac.in ను సందర్శించాలని సూచించారు. ఈ కోర్సుల గురించి స్కూళ్లలో ప్రచారం కల్పించాలని సూచించారు.