Reading Time: 2 minutes

NRIలకు శుభవార్త.. డాలర్ డిపాజిట్లపై భారీ వడ్డీ ఆఫర్ ప్రకటించిన రిజర్వు బ్యాంక్.. డోన్ట్ మిస్

Caption of Image.

విదేశాల్లో కష్టపడి సంపాదిస్తూ.. తమ డాలర్లను ఎక్కడ దాచుకోవాలో తెలియక సతమతమవుతున్న NRIలకు భారత రిజర్వు బ్యాంక్ ఒక అదిరిపోయే బంపర్ ఆఫర్ ప్రకటించింది. గ్లోబల్ మార్కెట్‌లో రూపాయి విలువ హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా.. తమ డాలర్లను భారత్‌లోనే భద్రంగా దాచుకుని, మునుపెన్నడూ లేని విధంగా అత్యధిక లాభాలను ఆర్జించే సువర్ణావకాశాన్ని ఆర్‌బీఐ కల్పించింది. డాలర్ డిపాజిట్లపై ఏకంగా 6% నుంచి 7% పైగా వడ్డీని ఆఫర్ చేస్తూ రిజర్వు బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయం ఇప్పుడు ఎన్‌ఆర్‌ఐ వర్గాల్లో ఫుల్ క్రేజ్ తెచ్చిపెడుతోంది. గ్లోబల్ ఇన్వెస్టర్లకు ఇంతకంటే గుడ్ న్యూస్ ఇంకేముంటుంది?

భారీగా పెరిగిన వడ్డీ రేట్లు – అసలు స్కీమ్ ఇదే

ఆర్‌బీఐ తన తాజా మానిటరీ పాలసీ రివ్యూలో ఫారిన్ కరెన్సీ నాన్-రెసిడెంట్ అంటే FCNR(B) డిపాజిట్లపై ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. 3 నుండి 5 ఏళ్ల కాలపరిమితితో.. సెప్టెంబర్ 30, 2026 లోపు చేసే కొత్త డిపాజిట్లపై విదేశీ మారకపు హెడ్జింగ్ ఖర్చులను పూర్తిగా ఆర్‌బీఐ భరిస్తుందని ప్రకటించింది. అంతేకాదు బ్యాంకులు ఈ డిపాజిట్లపై ఇవ్వగలిగే వడ్డీ రేట్ల పరిమితిని కూడా ఎత్తివేసింది. దీనివల్ల ప్రస్తుతం దేశంలోని ప్రముఖ బ్యాంకులు డాలర్ డిపాజిట్లపై ఏకంగా 6% వడ్డీని ఆఫర్ చేస్తుండగా, కొన్ని చిన్న ఫైనాన్స్ బ్యాంకులు.. ఉదాహరణకు ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గరిష్టంగా 7.13% వరకు వడ్డీని అందిస్తున్నాయి. అమెరికా ట్రెజరీ బాండ్లపై వచ్చే 4-4.2% వడ్డీతో పోలిస్తే, భారత్‌లో దాదాపు 2 నుండి 3 శాతం అదనపు లాభం లభిస్తోంది.

కరెన్సీ రిస్క్ లేదు.. పన్ను భారం అస్సలే లేదు

సాధారణంగా ఎన్‌ఆర్‌ఈ డిపాజిట్లలో డబ్బులు దాచుకుంటే డాలర్లు రూపాయిల్లోకి మారతాయి. దీనివల్ల రూపాయి విలువ పడిపోయినప్పుడు నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ FCNR(B) డిపాజిట్ల స్పెషాలిటీ ఏంటంటే.. మీరు ఏ కరెన్సీలో డిపాజిట్ చేస్తారో, మెచ్యూరిటీ తర్వాత వడ్డీతో సహా అదే కరెన్సీలో డబ్బులు మీకు తిరిగి వస్తాయి. అంటే రూపాయి హెచ్చుతగ్గుల రిస్క్ అస్సలు ఉండదు. అన్నింటికీ మించి ఈ డిపాజిట్లపై వచ్చే వడ్డీకి భారతదేశంలో ఎలాంటి టాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అలాగే ఈ మొత్తాన్ని పూర్తిగా విదేశాలకు తిరిగి తీసుకెళ్లే సదుపాయం కూడా ఉంది. ఎన్‌ఆర్‌ఐలు, ఓసీఐలు, పీఐఓలు కేటగిరీలకు చెందిన వ్యక్తులుఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.

గల్ఫ్, సింగపూర్ ఎన్‌ఆర్‌ఐలకు జాక్‌పాట్

ఈ స్కీమ్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్‌ఆర్‌ఐలందరికీ లాభమే అయినప్పటికీ.. గల్ఫ్ దేశాలైన యుఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, కువైట్, బహ్రెయిన్, ఒమన్ తో పాటు సింగపూర్‌లలో ఉండే వారికి ఇది ఒక జాక్‌పాట్ లాంటిదని చెప్పాలి. ఎందుకంటే ఈ దేశాల్లో వ్యక్తిగత ఆదాయం, డెట్ ఇన్‌స్ట్రుమెంట్స్‌పై పన్నులు ఉండవు. ఇక్కడ లభించే 6-7% వడ్డీ, సాధారణంగా లభించే 9% ప్రీ-టాక్స్ రిటర్న్స్‌తో సమానం. అమెరికా, యూకే వంటి దేశాల్లో ఉండే ఎన్‌ఆర్‌ఐలకు అక్కడి స్థానిక పన్ను నిబంధనలు వర్తించినప్పటికీ.. యూఎస్ ట్రెజరీ కంటే 2% అదనపు లాభం ఉండటం వల్ల వారికి కూడా ఇది బెస్ట్ ఆప్షన్ కానుందని నిపుణులు అంటున్నారు.

స్మార్ట్ ఇన్వెస్ట్‌మెంట్ చేయండి..

ఈ అదిరిపోయే ఆఫర్ కేవలం సెప్టెంబర్ 30, 2026 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత ఆర్‌బీఐ హెడ్జింగ్ ఖర్చుల మద్దతును నిలిపివేస్తే బ్యాంకులు ఇంతటి భారీ వడ్డీ రేట్లను కొనసాగించలేవు. అయితే పాత ఎన్‌ఆర్‌ఈ డిపాజిట్లను ముందే విత్‌డ్రా చేసుకుంటే పెనాల్టీలు పడతాయి కాబట్టి.. ప్రస్తుతానికి మీ వద్ద ఉన్న సేవింగ్స్ మొత్తాలను ఈ స్కీమ్‌కు మళ్లించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. భారత్‌లో రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో పెట్టుబడి పెట్టి ఇబ్బంది పడేకంటే.. ఎలాంటి రిస్క్ లేని ఈ డాలర్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టడం ఎన్‌ఆర్‌ఐలకు అత్యంత సురక్షితమైన, లాభదాయకమైన మార్గం అని చెప్పుకోవచ్చు. 

©️ VIL Media Pvt Ltd.