Reading Time: < 1 minute
రోడ్డును బ్లాక్ చేసిన లారీలు.. అంబులెన్స్‌కు దారి లేక.. భుజాలపై రోగి.. చివరికి..!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక మాఫియా నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. అత్యవసర పరిస్థితిలో ఆసుపత్రికి తరలిస్తున్న రోగికి అంబులెన్స్‌కు సైతం దారి ఇవ్వకుండా ఇసుక లారీలను రోడ్డుపై అడ్డంగా నిలిపివేయడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన మణుగూరు మండలంలో చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహానికి దారితీసింది.

వివరాల్లోకి వెళ్తే.. మణుగూరు మండలం దమ్మక్కపేట గ్రామానికి చెందిన వంశీ (35) కుటుంబ కలహాల నేపథ్యంలో పురుగుల మందు తాగినట్లు సమాచారం. అతని పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు వెంటనే అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే సాంబాయిగూడెం నుంచి రామానుజవరం వరకు ఉన్న రహదారిపై పెద్ద సంఖ్యలో ఇసుక లారీలు అడ్డంగా నిలిపివేయడంతో అంబులెన్స్ ముందుకు కదలలేకపోయింది.

అత్యవసర పరిస్థితిని గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు లారీ డ్రైవర్లను వేడుకున్నప్పటికీ స్పందన లేకపోయిందని ఆరోపిస్తున్నారు. దీంతో చేసేదేమీ లేక వంశీని అంబులెన్స్ నుంచి దించి భుజాలపై మోసుకుంటూ ఆసుపత్రి వైపు పరుగులు తీశారు. అయినప్పటికీ విలువైన సమయం వృథా కావడంతో ఆసుపత్రికి చేరుకునేలోపే వంశీ పరిస్థితి మరింత విషమించింది. ఆసుపత్రిలో పరీక్షించిన వైద్యులు వంశీ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మరోవైపు, అతడిని కనీసం అరగంట ముందే ఆసుపత్రికి తీసుకొచ్చి ఉంటే ప్రాణాలు కాపాడే అవకాశం ఉండేదని వైద్యులు కుటుంబ సభ్యులకు తెలిపినట్లు సమాచారం. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇసుక లారీలు రహదారిని పూర్తిగా దిగ్బంధించడం వల్లే వంశీ ప్రాణాలు కోల్పోయాడని బంధువులు ఆరోపిస్తున్నారు. అత్యవసర సేవలకు సైతం మార్గం కల్పించకుండా రహదారులను ఆక్రమించడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి రుజువు చేసిందని స్థానికులు మండిపడుతున్నారు. ఈ ఘటనపై జిల్లా అధికారులు, పోలీసు శాఖ వెంటనే స్పందించి పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని, అక్రమంగా రహదారులను దిగ్బంధిస్తున్న ఇసుక మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఒక వ్యక్తి ప్రాణాన్ని బలితీసుకున్న ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకుంటుందా లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..