Reading Time: < 1 minute
తెలంగాణకు రక్షణ రంగం బూస్ట్.. కేంద్ర మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ!

న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కీలక సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులపై ఇరువురు నేతలు విస్తృతంగా చర్చించారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం రక్షణ శాఖకు చెందిన భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించినందుకు సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని ఈ సందర్భంగా ఆయన అభినందించారు.

అలాగే రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి అంశాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రస్తావించారు. భూ సేకరణ, యుటిలిటీల బదలాయింపు తదితర అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర మంత్రికి హామీ ఇచ్చారు. దేశ భద్రత, రక్షణకు సంబంధించిన ప్రాజెక్టు కావడంతో రాష్ట్రం తరఫున అవసరమైన అన్ని విధాల సహాయ సహకారాలు అందజేస్తామని స్పష్టం చేశారు.

భారత వైమానిక దళం విస్తరణ ప్రణాళికల్లో భాగంగా ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌ను భారీ స్థాయిలో అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో, ప్రయాణికుల కోసం సివిల్ ఏవియేషన్ టెర్మినల్, కార్గో సదుపాయాలు, మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్‌హాల్ కేంద్రాలు, హ్యాంగర్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. దీంతో పాటు అంతర్జాతీయ స్థాయి విమానయాన సంస్థలు తమ హ్యాంగర్లను ఏర్పాటు చేసుకునేలా ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌ను అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల మధ్యప్రాచ్య ప్రాంతంలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ప్రపంచ ప్రఖ్యాత ఎయిర్‌లైన్స్‌కు ప్రత్యామ్నాయ కేంద్రంగా ఆదిలాబాద్ ఎదిగే అవకాశాలు ఉన్నాయని సీఎం అభిప్రాయపడ్డారు.

అలాగే మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర సమీపంలో డీఆర్‌డీవో, డీఆర్‌డీఎల్ ప్రతిపాదించిన కీలక రక్షణ ప్రాజెక్టుకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర రక్షణ మంత్రిని కోరారు. రాష్ట్ర అభివృద్ధి, జాతీయ భద్రతకు సంబంధించిన అంశాల్లో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు సాగాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…