Reading Time: < 1 minute

కామారెడ్డి కాంగ్రెస్‌‌‌‌ లో ముగిసిన పంచాయితీ… ఒక్కటైన షబ్బీర్ అలీ, చంద్ర శేఖర్ రెడ్డి వర్గాలు

Caption of Image.

హైదరాబాద్, వెలుగు: కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్‌‌‌‌లో కొంతకాలంగా కొనసాగుతున్న గ్రూపు తగాదాలకు ఎట్టకేలకు తెరపడింది. షబ్బీర్ అలీ, చంద్రశేఖర్ రెడ్డి వర్గాల మధ్య ఉన్న విభేదాలను టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ ఆదివారం విజయవంతంగా పరిష్కరించింది. గత కొంతకాలంగా ఇరు వర్గాల నాయకులు ఒకరిపై మరొకరు గాంధీభవన్‌‌‌‌లో పీసీసీకి వరుస ఫిర్యాదులు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన క్రమశిక్షణా కమిటీ ఆదివారం గాంధీభవన్‌‌‌‌లో ఇరు వర్గాలతో ప్రత్యేకంగా సమావేశమైంది. 

కమిటీ చైర్మన్ మల్లు రవి సమక్షంలో షబ్బీర్ అలీ, అలాగే చంద్రశేఖర్ రెడ్డి దంపతులు హాజరై తమపై వచ్చిన ఫిర్యాదులపై వివరణ ఇచ్చారు. ఇరు వర్గాల వాదనలు విన్న క్రమశిక్షణా కమిటీ పార్టీ ప్రయోజనాల దృష్ట్యా కలిసి పనిచేయాలని సూచించింది. కమిటీ సయోధ్యతో ఇద్దరు నేతలు తమ విభేదాలను పక్కనబెట్టి ఒక్కటయ్యారు. మల్లు రవి సమక్షంలోనే ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటూ, తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవనే స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చారు. దీంతో కామారెడ్డి కాంగ్రెస్‌‌‌‌లో సుదీర్ఘకాలంగా నడుస్తున్న వివాదానికి ఫుల్‌‌‌‌స్టాప్ పడినట్లయింది.

©️ VIL Media Pvt Ltd.