Reading Time: 2 minutes

హైదరాబాద్: దేవాలయాల పాలనకు ‘సీటా’..స్టేట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్స్ ఏర్పాటు

Caption of Image.
  •     12 ఏళ్ల తర్వాత పునఃప్రారంభం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని దేవాలయాల నిర్వహణను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం ‘స్టేట్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్’ (సీటా)ను పునఃప్రారంభించింది.  హైదరాబాద్ బొగ్గులకుంటలోని ధార్మిక భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సీటా కార్యాలయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ‘సీటా’ ఉమ్మడి ఏపీలో క్రియాశీలక పాత్ర పోషించింది. దీనివల్ల వేల ఎకరాల ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి సంస్థల విభజన, సిబ్బంది సర్దుబాటు వంటి కారణాలతో ‘సీటా’ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. పదేళ్లుగా ఈ సంస్థ లేకపోవడంతో కొత్తగా వచ్చిన అధికారులకు సరైన శిక్షణ కరువైందని, తద్వారా పాలనాపరమైన ఇబ్బందులు ఎదురయ్యాయని అధికారులు చెబుతున్నారు.

ఆలయ భూములకు రక్షణ కవచం.. 

రాష్ట్రంలోని వివిధ ఆలయాల్లో పూజా కార్యక్రమాలు, ఉత్సవాలు వేర్వేరు రీతుల్లో జరుగుతుండేవి. సీటా ద్వారా అర్చకులకు ‘ఆగమ శాస్త్రం’లో రిఫ్రెషర్ కోర్సులు నిర్వహించి, ధూప దీప నైవేద్యాల నుంచి బ్రహ్మోత్సవాల వరకు ఒకే రకమైన శాస్త్రోక్త పద్ధతిని అమలు చేసేలా చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలకు వేల ఎకరాల భూములుండగా.. కోర్టుల్లో ఉన్న వివాదాలను ఎలా ఎదుర్కోవాలి.? రికార్డులను ఎలా భద్రపరచాలి అనే అంశాలపై సీటా సిబ్బందికి శిక్షణను ఇస్తుంది.  దేవాలయాల  భూముల ఆక్రమణలను అరికట్టడంతోపాటు వాటికి రక్షణ కవచంగా నిలువనున్నది. ఆలయాలకు వచ్చే కానుకలు, హుండీ ఆదాయం, విరాళాల నిర్వహణలో పూర్తి పారదర్శకత పెరుగనున్నది. అకౌంటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డిజిటల్ విధానాలను అమలు చేయాలనే దానిపై సిబ్బందికి శిక్షణనిస్తుంది. 

దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిపేలా.. 

ఈ సంస్థ ద్వారా దేవాదాయశాఖను దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలపాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆలయ ఆదాయంలో లీకేజీలను అరికట్టి, డిజిటలైజేషన్ ద్వారా పారదర్శకతకు పెద్దపీట వేయనున్నారు. రాబోయే మూడు పనిదినాల్లో దేవాలయ సంస్కృతి-, ఆగమ శాస్త్రాలు అనే అంశంపై ధార్మిక భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోపాటు భద్రాచలం, యాదగిరిగుట్ట, వేములవాడ వంటి ప్రముఖ క్షేత్రాల్లో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 

ఆధ్యాత్మిక కేంద్రంగా తెలంగాణ: మంత్రి కొండా సురేఖ

సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ‘సీటా’ ద్వారా శిక్షణ పొందిన ఉద్యోగులు ఆలయాల రూపురేఖలను మారుస్తారని ఆశిస్తున్నానని తెలిపారు. అర్చకులు, ఉద్యోగులు సమర్థవంతంగా పనిచేసి భక్తులకు మెరుగైన వసతులు కల్పించాలన్నారు. 26 మందికి గ్రేడ్-1 ఈవోలుగా, 38 మంది ఉద్యోగులకు ప్రమోషన్లు ఇచ్చినట్లు గుర్తుచేశారు. 

©️ VIL Media Pvt Ltd.