Reading Time: 2 minutes
Ambati Rambabu Counter To Pawan Kalyan Saikrishna Case Ap Politics

Ambati Rambabu: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమరావతిలో జరిగిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని ఎండగట్టారు. సాయికృష్ణ కేసు నుంచి సుగాలీ ప్రీతి ఉదంతం వరకు ప్రతి విషయంలోనూ పవన్ ప్రజలను, బాధితులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఒకవైపు ప్రభుత్వం సాయికృష్ణ కుటుంబాన్ని పిలిపించి న్యాయం చేస్తామని చెబుతుంటే.. మరోవైపు పవన్ కళ్యాణ్ ఏమో సాయికృష్ణను ఒక క్రిమినల్ అని మాట్లాడుతున్నారని అన్నారు. అదే సమయంలో జనసేన నేత సామినేని ఉదయభాను సాయికృష్ణ తల్లిని ఓదార్చేందుకు వెళ్లి.. పవన్ కళ్యాణ్ పంపిస్తేనే వచ్చామని చెబుతున్నారు. అసలు పవన్ ఏం చెప్పాలనుకుంటున్నారో ఆయనకే తెలియాలి అని అన్నారు. వైసిపి నేతలను తాటతీస్తామంటూ పవన్ చేస్తున్న వ్యాఖ్యలపై అంబటి మండిపడ్డారు.

“రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఇలా మాట్లాడొచ్చా? మీ ఎమ్మెల్యే పంతం నానాజీ భాష ఎలా ఉందో చూశారా? అసలు ఎవరు గూండాలు? పవన్ గారూ.. మీరు ఏడు జన్మలెత్తినా మమ్మల్ని ఏమీ చేయలేరు. మీ ఉడత ఊపులకు, సొల్లు కబుర్లకు ఇక్కడెవరూ భయపడరు” అని స్పష్టం చేశారు. “నేను హోంమంత్రిగా లేకపోవడం మీ అదృష్టం” అని పవన్ అనడం ద్వారా ప్రస్తుతం ఉన్న హోంమంత్రి సరిగ్గా పని చేయడం లేదని ఆయనే ఒప్పుకున్నట్లయిందని అంబటి ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్‌కు హోంమంత్రి పదవి ఇవ్వాలని తాను సీఎం చంద్రబాబును రిక్వెస్ట్ చేస్తున్నానని పేర్కొన్నారు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోకూడదని, ముంబై దాడుల నిందితుడు కసబ్‌ను కూడా చట్టప్రకారమే శిక్షించారని గుర్తు చేశారు. సాయికృష్ణ కేసులో ఒక అధికారి విచారణ జరుపుతుండగా హఠాత్తుగా ‘సిట్’ (SIT) వేయడం వెనుక ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేకనే ఈ నాటకాలు ఆడుతున్నారని, ఈ కేసులో వాస్తవాలు బయటకు రావాలంటే సీబీఐ లేదా ఎన్ఐఏ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కోనసీమలో కాపు నేతల సమావేశంపై పవన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని, గతంలో కులాల గురించి పవన్ మాట్లాడినట్లుగా ఈ రాష్ట్రంలో ఎవరూ మాట్లాడి ఉండరని అంబటి రాంబాబు దుయ్యబట్టారు. ఒకవైపు సాయికృష్ణ ఇంటికి జనసేన నేతలను పంపుతూ.. మరోవైపు ఈ కేసులో నిందితుడైన సీఐ నాగరాజును అరెస్ట్ చేయవద్దని ఆందోళనలు చేయించడం పవన్ దుర్మార్గపు రాజకీయాలకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు.