Reading Time: < 1 minute
Ys Jagan To Visit Pulivendula For Three Day Tour Public Grievance Meetings Planned

YS Jagan Pulivendula Tour: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు మూడు రోజుల పాటు పులివెందులలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రజలను కలుసుకోవడంతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. తన పర్యటనలో భాగంగా ఈ నెల 23వ తేదీ సాయంత్రం 4 గంటలకు వైఎస్ జగన్ పులివెందులకు చేరుకోనున్నారు. అనంతరం భాకరాపురం క్యాంప్ కార్యాలయంలో నిర్వహించే ప్రజాదర్భార్‌లో పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు. రాత్రికి పులివెందులలోని తన నివాసంలో బస చేయనున్నారు.

ఇక, 24వ తేదీ ఉదయం 9 గంటలకు పులివెందుల నుంచి బయలుదేరి వేముల మండలం భూమయ్యగారిపల్లెకు చేరుకోనున్నారు. అక్కడ గట్టు లక్ష్మీనరసింహ స్వామి వారి నూతన దేవాలయ ప్రారంభోత్సవ మహోత్సవాల్లో పాల్గొంటారు. ఆలయ కార్యక్రమాలు ముగిసిన అనంతరం తిరిగి పులివెందుల క్యాంప్ కార్యాలయానికి చేరుకుని ప్రజాదర్భార్ నిర్వహించనున్నారు. అనంతరం రాత్రికి పులివెందులలోని తన నివాసంలో బస చేస్తారు. మరోవైపు, 25వ తేదీ ఉదయం 8 గంటలకు పులివెందుల నుంచి తిరుగు ప్రయాణం కానున్నారు. ఈ మూడు రోజుల పర్యటనలో ప్రజలను కలుసుకోవడంతో పాటు స్థానిక సమస్యలపై కూడా ఆరా తీసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.