Reading Time: < 1 minute

నాకౌట్‌‌ కు జర్మనీ… 2–1తో ఐవరీ కోస్ట్‌‌పై విజయం..డెనిజ్‌‌ ఉందావ్‌‌ డబుల్‌‌ గోల్స్‌‌

Caption of Image.

టొరంటో: ఫిఫా వరల్డ్‌‌ కప్‌‌లో జర్మనీ నాకౌట్‌‌ దశకు అర్హత సాధించింది. ఆదివారం జరిగిన గ్రూప్‌‌–ఈ మ్యాచ్‌‌లో 2–1 తేడాతో ఐవరీ కోస్ట్‌‌పై విజయం సాధించింది. సెకండాఫ్‌‌లో సబ్‌‌స్టిట్యూట్‌‌గా వచ్చిన డెనిజ్‌‌ ఉందావ్‌‌ (68, 90+4వ ని) రెండు గోల్స్‌‌ జట్టుకు కీలక విజయాన్ని అందించాడు. నదీమ్‌‌ అమిరి దూరం నుంచి పంపిన బంతిని స్ట్రయికర్‌‌ కై హోవెర్జ్‌‌ వదిలేయగా, పక్క నుంచి దూసుకొచ్చిన ఉందావ్‌‌ దాన్ని గోల్‌‌గా మలిచాడు. 

అమిరి, ఉందావ్‌‌ గ్రౌండ్‌‌లోకి అడుగుపెట్టిన ఎనిమిది నిమిషాలకే ఈ గోల్‌‌ను కొట్టారు. ఇక స్టాపేజ్‌‌ టైమ్‌‌ నాలుగో నిమిషంలో ఫెలిక్స్‌‌ మెచా అందించిన పాస్‌‌ను ఉందావ్‌‌ నేర్పుగా  గోల్‌‌ పోస్ట్‌‌లోకి పంపాడు. మ్యాచ్‌‌ 30వ నిమిషంలో ఐవరీ కోస్ట్‌‌ కెప్టెన్‌‌ ఫ్రాంక్‌‌ కేసీ తొలి గోల్‌‌ కొట్టాడు. మిడ్‌‌ఫీల్డర్ యాన్ డియోమాండే పంపిన క్రాస్‌‌ను ఫార్వర్డ్ ఆటగాడు అమాద్ డియాలో గోల్ వైపు కొట్టగా, జర్మనీ డిఫెండర్ నథానియల్ బ్రౌన్ అడ్డుకున్నాడు. అయితే ఆ బంతి తిరిగి కేసీ వద్దకు రావడంతో ఆయన సులువుగా నెట్‌‌లోకి పంపాడు. 

తొలి అర్ధభాగంలో జర్మనీ చేసిన రెండు గోల్స్ ఫౌల్స్ అయ్యాయి. 21వ నిమిషంలో ఐవరీ కోస్ట్ కీపర్ ఫోఫానా చేతుల్లోంచి బంతి నెట్‌‌లోకి వెళ్లినప్పటికీ, జర్మనీ మిడ్‌‌ఫీల్డర్ అలెగ్జాండర్‌‌ పావ్లోవిచ్ కీపర్‌‌ను అక్రమంగా నెట్టడంతో ఆ గోల్‌‌ను అంపైర్ తిరస్కరించాడు. అలాగే 38వ నిమిషంలో జమాల్ ముసియాలా ఫౌల్ చేయడంతో హావెర్జ్‌‌  చేసిన మరో గోల్ కూడా నమోదు చేయలేదు.

©️ VIL Media Pvt Ltd.