Reading Time: < 1 minute
ఆడంబరాల కంటే ఆధ్యాత్మికతే మిన్న: భగవద్గీతనే పెళ్లి పత్రికగా మార్చిన దంపతులు!

సాధారణంగా పెళ్లి పత్రికలు అంటే రంగురంగుల కాగితాలు, ఖరీదైన డిజైన్లు కనిపిస్తాయి. కానీ సంగారెడ్డి జిల్లాలో ఓ కుటుంబం మాత్రం తమ కూతురి పెళ్లిని హిందూ ధర్మ ప్రచారానికి వేదికగా మార్చుకుంది. సాక్షాత్తూ శ్రీకృష్ణ పరమాత్మ బోధించిన భగవద్గీత పుస్తకాన్నే వివాహ పత్రికగా ముద్రించి అందరినీ ఆశ్చర్యపరిచారు…

ప్రస్తుత కాలంలో వెడ్డింగ్ కార్డ్స్ అంటే పోటీలు పడి మరీ లక్షల రూపాయలు ఖర్చు చేసి డిజైన్ చేయిస్తున్నారు. కానీ, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణానికి చెందిన చాప్టా నిర్మల – నర్సారెడ్డి దంపతులు మాత్రం విభిన్నంగా ఆలోచించారు. తమ చిన్న కుమార్తె అర్చన వివాహాన్ని పురస్కరించుకుని..సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యం తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం వారు ఎంచుకున్న మార్గం – ‘శ్రీమద్భగవద్గీత’

గోరఖ్‌పూర్ గీతా ప్రెస్ నుంచి 1500 భగవద్గీత పుస్తకాలను తెప్పించిన ఈ దంపతులు ఆ పుస్తకం కవర్ బ్యాక్ పేజీ, మూడవ పేజీని పెళ్లి పత్రికగా తీర్చిదిద్దారు. ఈ నెల 29న నారాయణఖేడ్ మా ఫంక్షన్ హాల్‌లో జరగబోయే అర్చన-బాగారెడ్డిల వివాహానికి వచ్చే అతిథులకు ఈ జ్ఞాన నిధిని అందజేస్తున్నారు. నేటి తరానికి గీత ప్రాముఖ్యతను, హిందూ ధర్మం, సంప్రదాయాలను తెలియజేయాలనేదే తమ ముఖ్య ఉద్దేశమని వారు చెబుతున్నారు.

అంతేకాకుండా, వీరి రెండో కుమార్తె అనసూజ రెడ్డి విశ్వహిందూ పరిషత్‌లో క్రియాశీలకంగా పని చేస్తూ దుర్గావాహినిలో సేవలందిస్తున్నారు. తమ కుటుంబం నుంచి ధర్మాచరణ పట్ల ఉన్న ఈ నిబద్ధతను ఊరంతా మెచ్చుకుంటోంది. పెళ్లి పత్రికను భద్రంగా దాచుకోవడమే కాదు, అది చదివి విజ్ఞానాన్ని పొందేలా చేసిన ఈ కుటుంబంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఖర్చుతో కూడిన ఆడంబరాల కంటే, ఇలాంటి విజ్ఞానాన్ని పంచే ఆహ్వానాలు సమాజానికి ఎంతో అవసరం. ఈ వినూత్న వివాహ పత్రిక ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్‌గా మారింది.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..