వేసవి కాలం అంటేనే మామిడి పండ్ల సీజన్. తీయని రుచితో పాటు విటమిన్ ఏ, సి, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉండే మామిడిని అందరూ ఇష్టంగా తింటారు. అయితే, ఈ తీపి పండు అందరికీ ఆరోగ్యకరం కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మధుమేహం (Diabetes) ఉన్నవారు మామిడి పండ్లను తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇవి రక్తంలోని చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతాయి.
మధుమేహ వ్యాధిగ్రస్తులు (Diabetes): మామిడి పండులో సహజంగానే చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తిన్నప్పుడు రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు వేగంగా పెరుగుతాయి. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు వైద్యుని సలహా మేరకు మాత్రమే పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. మామిడి పండ్లను తినే ముందు కనీసం గంట సేపు నీటిలో నానబెట్టడం వల్ల వాటి వేడి చేసే గుణం తగ్గుతుంది.
బరువు పెరగడం (Obesity): మామిడిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలని ప్రయత్నించే వారు లేదా ఇప్పటికే అధిక బరువు ఉన్నవారు మామిడి పండ్లను ఎక్కువగా తింటే బరువు మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్ల వినియోగాన్ని పరిమితం చేయాలి.
జీర్ణ సంబంధిత సమస్యలు: గ్యాస్, ఎసిడిటీ లేదా అజీర్తితో బాధపడేవారు మామిడి పండ్లను తినేటప్పుడు జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా ఖాళీ కడుపుతో వీటిని తీసుకోవడం వల్ల కొందరిలో పొట్టలో అసౌకర్యం కలగవచ్చు. జీర్ణక్రియ సమస్యలతో బాధపడేవారు, అలర్జీలు ఉన్నవారు మామిడి పండ్లను ఎంత తక్కువగా తింటే అంత మంచిది.
అలర్జీలు: కొందరికి మామిడి పండ్ల వల్ల అలర్జీ రావచ్చు. దీనిని తిన్న తర్వాత నోటి చుట్టూ దురద, గొంతులో మంట లేదా చర్మంపై దద్దుర్లు కనిపిస్తే వెంటనే మామిడి పండ్లను తినడం ఆపేయాలి. అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్లుగా, ఏదైనా పరిమితికి మించి తీసుకుంటే అది ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. మామిడి పండ్ల విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది.
మామిడి పండ్లను ఎలా తినాలి?: మామిడి పండ్లను తినడానికి సరైన పద్ధతి ఒకటి ఉంది. వీటిని తినడానికి ముందు కనీసం 1 నుండి 2 గంటల పాటు నీటిలో నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల మామిడిలోని ఉష్ణ తత్వం (వేడి చేసే గుణం) తగ్గుతుంది. ఇది శరీరానికి మేలు చేస్తుంది. రుచి బాగుందని అతిగా తినకుండా, మీ ఆరోగ్య స్థితిని బట్టి తగిన మోతాదులో తీసుకుంటే సీజన్ పండు ఆనందాన్ని పొందవచ్చు. ఏదైనా సందేహం ఉంటే మీ డాక్టర్ ను సంప్రదించడం మంచిది.





