Reading Time: 2 minutes
Trump Iran Nuclear Sites Operation Midnight Hammer Media Criticism

ఆపరేషన్ మిడ్‌నైట్ హామర్ పేరుతో ఇరాన్ అణు కేంద్రాలు ధ్వంసం చేశామని.. కానీ కొన్ని మీడియా సంస్థలు కవరేజ్ చేయలేదని ట్రంప్ విమర్శించారు. తాజాగా ఆపరేషన్ మిడ్‌నైట్ హామర్‌పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఆపరేషన్ ద్వారా ఇరాన్‌కు చెందిన అణు సంబంధిత కేంద్రాలను పూర్తిగా ధ్వంసం చేశామని ప్రకటించారు. అయితే ఈ వార్తలను కొన్ని మీడియా సంస్థలు తక్కువ చేసి చూపించాయని ధ్వజమెత్తారు. వాటిని తిరిగి నిర్మించడం చాలా కష్టమైన పని.. కానీ ఫేక్ న్యూస్ మీడియా అమెరికా వైమానిక దళ సిబ్బందికి సరైన గుర్తింపు ఇవ్వలేదని మండిపడ్డారు.

గతేడాది జూన్ 12న ఇరాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. అణు కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేసింది. అనంతరం జూన్ 22న అమెరికా వైమానిక దళం, నౌకాదళం కలిసి ఇరాన్‌లోని అణు కేంద్రాలను ధ్వంసం చేశాయి. ఫోర్డో యురేనియం ఎన్‌రిచ్‌మెంట్ ప్లాంట్, నతాంజ్ అణు కేంద్రం, ఇస్ఫహాన్ న్యూక్లియర్ టెక్నాలజీ సెంటర్‌లను లక్ష్యంగా చేసుకుని బంకర్ బస్టర్ బాంబులతో దాడులు నిర్వహించారు. ఈ దాడులు 12 రోజుల యుద్ధంలో కీలక ఘట్టంగా నిలిచాయి. జూన్ 24న కాల్పుల విరమణతో యుద్ధం ముగిసింది.

తాజాగా ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై దాడి చేశాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సహా కీలక నేతలందరినీ హతమార్చాయి. ప్రతీకారంగా ఇరాన్ కూడా గల్ఫ్ దేశాలపై దాడులు చేసింది. దాదాపు 40 రోజుల యుద్ధం తర్వాత రెండు వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఈ గడువు రేపటితో ముగుస్తోంది. అయితే ఇప్పటి వరకు రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం జరగలేదు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

తొలి విడత చర్చలు ఇస్లామాబాద్ వేదికగా 21 గంటల పాటు జరిగాయి. కానీ చర్చలు ఫలించలేదు. అయితే రెండో దఫా చర్చలు ఈరోజు జరగాల్సి ఉండగా ఇరాన్ ఇంకా అధికారికంగా స్పందించలేదు. అయితే సోమవారం రాత్రి ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా చర్చలకు వెళ్లాలని ఇరాన్ బృందానికి సూచించినట్లుగా వార్తలు వస్తున్నాయి. కానీ క్లారిటీ లేదు. దీంతో చర్చలు జరుగుతాయా? లేదా ? అన్నది సందిగ్ధం నెలకొంది. లేదంటే మరోసారి పశ్చిమాసియాలో యుద్ధం మొదలయ్యేటట్టు కనిపిస్తోంది.

ఇది కూడా చదవండి: PM Modi: ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న మోడీ ‘ఝల్‌మురి’ వీడియో