Reading Time: < 1 minute
Hydraa Demolishes Illegal Encroachment Attapur Government Land

Hyderabad: నగరంలో అక్రమ కబ్జాలపై ‘హైడ్రా’ (HYDRAA) తన ఉక్కుపాదం కొనసాగిస్తోంది. తాజాగా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివాలయం సమీపంలో అక్రమంగా కబ్జాకు గురైన భారీ ప్రభుత్వ స్థలాన్ని అధికారులు శనివారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు. ​అత్తాపూర్ సర్వే నంబర్లు 354/1, 354/2, 354/3, 354/4 లో ఉన్న సుమారు రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని పది రోజుల క్రితం ఒక వర్గానికి చెందిన వ్యక్తులు అక్రమంగా ఆక్రమించే ప్రయత్నం చేశారు. రాత్రికి రాత్రే అక్కడ బ్లూ షీట్లు (Blue Sheets) ఏర్పాటు చేసి, కంచె వేసి కబ్జాకు పాల్పడ్డారు. స్థానికుల నుంచి అందిన సమాచారంతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు, రెవెన్యూ విభాగంతో కలిసి నేడు ఉదయాన్నే ఆపరేషన్ ప్రారంభించారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య ​కూల్చివేత ప్రారంభించారు. ఈ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ​దాదాపు 200 మంది పోలీసు బలగాల మధ్య ఈ తొలగింపు ప్రక్రియ కొనసాగింది. ​కబ్జాదారులు ఏర్పాటు చేసిన బ్లూ షీట్లను, తాత్కాలిక నిర్మాణాలను జేసీబీలతో నేలమట్టం చేశారు. ​ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం స్వాధీనం చేసుకున్న ఈ రెండు ఎకరాల భూమి విలువ 100 కోట్ల రూపాయల పైనే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే ఎంతటి వారైనా విడిచిపెట్టేది లేదని అధికారులు ఈ
సందర్భంగా హెచ్చరించారు.

READ MORE: Telangana Weather Update: మండే ఎండల మధ్య చల్లటి కబురు.. తెలంగాణలో రెండ్రోజుల పాటు వర్షాలు..