Reading Time: < 1 minute

అయ్యో పాపం.. ఈ కుటుంబం.. వికారాబాద్ జిల్లాలో విషాద ఘటన

Caption of Image.

వికారాబాద్: అప్పుల బాధ తట్టుకోలేక ఓ మహిళా ఆత్మహత్య చేసుకున్న ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలో చోటు చేసుకుంది. తాము ఇచ్చిన లక్ష రూపాయలు వెంటనే చెల్లించాలంటూ వడ్డీ వ్యాపారులు చేసిన వేధింపులు తట్టుకోలేక, పురుగుల మందు తాగి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది.

వివరాల్లోకి వెళితే.. తాండూరు మండలం సిరిగిరి పేట్కు చెందిన లక్ష్మి అప్పుల బాధకు ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి భర్త తెలిపిన వివరాల ప్రకారం.. తన భార్య లక్ష్మి స్థానికంగా ఉండే హనుమంత్ రెడ్డి వద్ద లక్ష రూపాయలు అప్పుగా తీసుకున్నారు. పంటలు పండకపోవడంతో గడువులోగా డబ్బు చెల్లించలేకపోయారు. దీంతో హనుమంత్ రెడ్డి దంపతులు లక్ష్మిపై ఒత్తిడి పెంచారు.

సమయం ఇవ్వాలని ప్రాధేయపడినా వినకుండా, ఊరిలో అందరూ చూస్తుండగానే అసభ్య పదజాలంతో దూషించి, సూటిపోటి మాటలతో తీవ్రంగా అవమానించారని లక్ష్మి భర్త ఆవేదన వ్యక్తం చేశాడు. నిందితులు చేసిన అవమానాన్ని భరించలేక లక్ష్మి తీవ్ర మనస్తాపానికి గురై, తన వల్ల కుటుంబానికి అవమానం జరిగిందన్న బాధతో ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడిందని తెలిపారు. 

తాము పొలం అమ్మి అయినా మీ బాకీ తీరుస్తామని చెప్పామని, కానీ వారు కనికరం లేకుండా మాట్లాడారని లక్ష్మి భర్త కన్నీరుమున్నీరయ్యాడు. ఇప్పుడు తన పిల్లలు తల్లి ప్రేమకు దూరమయ్యారని లక్ష్మి భర్త ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.