
మన తెలంగాణ/శేరిలింగంపల్లి: అంతర్జాతీయంగా జరుగుతున్న యుద్ధ పరిణామాలు దేశంలో ఇంధన రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నా యి. ఈ ప్రభావం ఇప్పుడు నగరాల్లోని హోటల్స్, హాస్టల్స్, కంపెనీలపై ప్రత్యక్షంగా కనిపిస్తోంది. దక్షణాది, దక్కన్, ఇరానీ వంటకాలకు కేరాఫ్ అ డ్రస్‌గా ఉన్న హైదరాబాద్ మహానగరంపై ఈ ప్రభావం పెద్ద ఎత్తున పడుతుంది. విద్యార్థి, ఉద్యోగులతో పాటు బయటి ఆహారాన్ని ఇష్టంగా తినే నగర వాసులకు ఇపుడు కష్టంగా మారుతోంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా తీవ్రంగా తగ్గిపోవడంతో మార్కెట్లో కొరత ఏర్పడింది. దీం తో సిలిండర్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయా యి. అధికారికంగా లభించని పరిస్థితుల్లో బ్లాక్ మార్కెట్‌లో ఒక్క సిలిండర్ ధర ఆరు వేల రూపాయలు దాటిందని హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు. గ్యాస్ కొరతను కొందరు ఏజెన్సీలు అవకాశంగా మార్చుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చాలా రో జులుగా బుకింగ్ చేయని పేర్లపై సిలిండర్లు తీసుకుని వాటిని బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు అ మ్ముతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. డోమేస్టిక్ కాస్తా కమర్షియల్‌గా మారుతున్నాయి. గ్యాస్ ఏజెన్సీలు ఈ విధమైన వ్యాపారానికి తెరలేపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మూతపడే పరిస్థితిలో హోటల్స్, హాస్టల్స్, కంపెనీలు?
నగరంలో వేల సంఖ్యలో ఉన్న హాస్టల్స్, చిన్న హోటల్స్ ప్రస్తుతం గ్యాస్ కొరతతో సంక్షోభంలో ఉన్నాయి. అదేవిదంగా పలు కంపెనీలు కూడా ఇబ్బందుల్లో ఉన్నాయి.హైదరాబాద్ మహానగరంలో ముఖ్యంగా హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, ఎల్‌బీ నగర్, ఉప్పల్, దిల్‌సుఖ్‌నగర్, ఈసీఐఎల్, తార్నాక, మెహిదీపట్నం, దర్గా, కోకాపేట అమీర్ పేట్, పంజాగుట్ట, మియాపూర్,అదిభట్ల, వనస్థలిపురం, తుక్కుగూడ, పఠాన్ చెరువు, చందానగర్, కూకట్ పల్లి, జేఎన్టీయూ, కేపీ హెచ్ బీ, జెడిమెట్ల, షాపూర్, బాలానగర్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో వేల సంఖ్యలో హాస్టల్స్, హోటల్స్, జాతీయ, అంతర్జాతీయ కంపెనీ లు ఉన్నాయి. రోజూ లక్షలాది మందికి వంట చేయాల్సి ఉండటంతో గ్యాస్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇప్పుడు సిలిండర్లు దొరకకపోవడం, దొరికినా భారీ ధర ఉండటంతో నిర్వాహకులు నష్టాల్లో నడుపుతున్నారు. కొన్ని హోటల్స్ ఇప్పటికే పని గంటలు తగ్గించగా, మరికొన్ని పూర్తిగా మూతపడే పరిస్థితికి చేరుకున్నాయి.
మెనూలలో మార్పులు
గ్యాస్ వినియోగం ఎక్కువగా ఉండే వంటకాలను అనేక హోటల్స్ తమ మెనూ నుండి తొలగిస్తున్నాయి. ఎక్కువ సమయం పట్టే వంటలు చేయకుండా తక్కువ గ్యాస్‌తో అయ్యే వంటకాలకే పరిమితమవుతున్నాయి. దీంతో వినియోగదారులకు అందే ఆహారంలో కూడా మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.టీ, కాఫీ, దోశ, చపాతీ, పూరి లాంటి వంటకాలు అందుబాటులో ఉంచటం లేదు.అదేవిదంగా వేలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు ఉండే హాస్టల్స్‌లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. గ్యాస్ ఖర్చు తగ్గించేందుకు నిర్వాహకులు మెనూలలో మార్పులు చేస్తున్నారు. కొన్ని రోజుల పాటు వంటకాలను తగ్గించడం, సులభంగా అయ్యే ఆహారాన్ని మాత్రమే అందించడం వంటి మార్పులు చేస్తున్నారు. టెన్త్, ఇంటర్ విద్యార్థిని, విద్యార్థులకు ఉద్దేశించిన వందలాది హాస్టల్స్ లలో కూడా ఆందోళన కర పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ నెల 18 వరకు ఇంటర్ పరీక్షలు ముగుస్తుండగా ఎంసెట్ ఇతర కోచింగ్ ల కోసం విద్యార్థులు అక్కడే ఉండే అవకాశం ఉంది. అదే విదంగా ఈ నెల 14 నుండి 10వ తరగతి పరీక్షలు సైతం ప్రారంభం కానుండటంతో ఆయా హాస్టల్స్ పరిస్థితులు ఎలా ఉంటాయోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.రోజుకు రెండు మూడు సిలిండర్లు అవసరం అవుతుంది. ఇప్పుడు సిలిండర్ దొరకడం లేదు. దొరికినా ఆరు వేల రూపాయలు అడుగుతున్నారు. ఇలా అయితే హోటల్ నడపడం కష్టమే అని హోటల్ నిర్వాహకులు చెబుతుండగా,వందల మంది విద్యార్థులకు వంట చేయాలి, గ్యాస్ ఖర్చు ఎక్కువ కావడంతో మెనూలను మార్చాల్సి వస్తోందని హాస్టల్ ల యజమానులు చెబుతున్నారు. గ్యాస్ లేకపోతే మళ్లీ కట్టెలతో వంట చేయాల్సిన పరిస్థితి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కట్టెల పొయ్యిల వైపు నిర్వాహకుల చూపు
గ్యాస్ కొరత మరింత పెరగడంతో కొంతమంది హోటల్, హాస్టల్ నిర్వాహకులు మళ్లీ కట్టెల పొయ్యిల వైపు చూస్తున్నారు. గతంలో పూర్తిగా మానేసిన కట్టెల వంటలను తిరిగి ప్రారంభించాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నారు. కొన్ని చోట్ల ఇప్పటికే కట్టెలతో వంటలు ప్రారంభించినట్లు సమాచారం.గ్యాస్ దొరకకపోవడంతో కట్టెలకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. నగర పరిసర ప్రాంతాల నుంచి పెద్ద మొత్తంలో కట్టెలు తెప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో కట్టెల ధరలు కూడా పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.