Reading Time: 2 minutes

 టి20 ప్రపంచకప్‌లో భారత్ ఫైనల్‌కు చేరుకుంది. గురువారం వాంఖడే స్టేడియంలో ఉత్కంఠభరితంగా సాగిన రెండో సెమీ ఫైనల్లో టీమిండియా 7 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. ఆదివారం జరిగే తుది పోరులో న్యూజిలాండ్‌తో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ తలపడుతుంది. అహ్మదాబాద్‌లో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ స్కోరును సాధించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 246 పరుగులు చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలైంది. జాకబ్ బెతెల్ చారిత్రక సెంచరీతో ఇంగ్లండ్‌ను దాదాపు గెలిపించినంత పని చేశాడు. క్రికెట్ చరిత్రలో చిరకాలం గుర్తుండి పోయే ఇన్నింగ్స్ ఆడిన బెతెల్ 48 బంతుల్లోనే 7 సిక్సర్లు, 8 ఫోర్లతో 105 పరుగులు చేశాడు. మిగతా వారు విఫలం కావడంతో ఇంగ్లండ్‌కు పరాజయం తప్పలేదు.

సంజు విధ్వంసం..

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఓపెనర్ సంజు శాంసన్ అండగా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును పరిగెత్తించాడు. అయితే మరో ఓపెనర్ అభిషేక్ శర్మ తన పేలవమైన ఫామ్‌ను ఈ మ్యాచ్‌లోనూ కొనసాగిస్తూ 9 పరుగులకే పెవిలియన్ చేరాడు. కానీ వన్‌డౌన్‌లో వచ్చిన ఇషాన్ కిషన్‌తో కలిసి సంజు ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. ఇటు సంజు అటు ఇషాన్ తమ మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగి పోయారు. వరుస ఫోర్లు, సిక్సర్లతో కనువిందు చేశారు. వీరిని కట్టడి చేసేందుకు ఇంగ్లండ్ బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చెలరేగి ఆడిన ఇషాన్ 18 బంతుల్లోనే 4 ఫోర్లు, రెండు సిక్సర్లతో 39 పరుగులు చేసి ఔటయ్యాడు. తర్వాత వచ్చిన శివమ్ దూబెతో కలిసి సంజు తన జోరును కొనసాగించాడు. కళ్లు చెదిరే సిక్సర్లు, ఫోర్లతో సెంచరీ దిశగా సాగాడు. అయితే 42 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 89 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో తృటిలో శతకం చేసే ఛాన్స్‌ను చేజార్చుకున్నాడు. మరోవైపు దూకుడుగా ఆడిన శివమ్ దూబె 25 బంతుల్లోనే ఓ ఫోర్, నాలుగు సిక్సర్లతో 43 పరుగులు చేశాడు. చివర్లో హార్దిక్ 12 బంతుల్లో 27, తిలక్ వర్మ 7 బంతుల్లో 3 సిక్సర్లతో 21 పరుగులు చేయడంతో భారత్ స్కోరు 250 పరుగులను దాటింది.