Reading Time: < 1 minute

నేను షాక్ అయ్యా: గవర్నర్ బోస్ రాజీనామాపై సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు

Caption of Image.

కోల్‎కతా: పశ్చిమ బెంగాల్ గవర్నర్ పదవికి సీవీ ఆనంద బోస్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బోస్ ఆకస్మిక రాజీనామాపై వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ బోస్ ఆకస్మిక రాజీనామా తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఆయన రాజీనామాకు గల కారణం తనకు తెలియదని చెప్పారు. అయితే కొన్ని రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చడానికి బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేంద్ర హోం మంత్రి షా ఒత్తిడికి ఆయన గురై ఉండవచ్చని ఆరోపించారు.

 బోస్ స్థానంలో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవికి పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించినట్లు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు తనకు తెలిపాడని చెప్పారు. ఈ విషయంలో సంప్రదాయం ప్రకారం ఆయన నన్ను ఎప్పుడూ సంప్రదించలేదన్నారు. ఇటువంటి చర్యలు భారత రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తాయని.. మన సమాఖ్య నిర్మాణం పునాదిని దెబ్బతీస్తాయని కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

 కేంద్రం సహకార సమాఖ్య సూత్రాలను గౌరవించాలని.. అలాగే ప్రజాస్వామ్య సంప్రదాయాలను, రాష్ట్రాల గౌరవాన్ని దెబ్బతీసే ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలని సూచించారు. కాగా, నిత్యం మమతా బెనర్జీ సర్కార్‎తో కయ్యానికి కాలు దువ్వే సీవీ ఆనంద్ బోస్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఆకస్మికంగా తన పదవికి రాజీనామా చేయడం బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

 

©️ VIL Media Pvt Ltd.