Reading Time: < 1 minute

ఇరాన్ సారీ చెప్పాల్సిందే: డ్రోన్ అటాక్‎పై అజర్‎బైజాన్ ప్రెసిడెంట్ సీరియస్

Caption of Image.

బాకు: ఇరాన్‎పై అజర్‌బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అల్లియేవ్ సీరియస్ అయ్యారు. తమ దేశంపై డ్రోన్ దాడికి పాల్పడిన ఇరాన్ క్షమాపణ చెప్పాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటనకు బాధ్యులను జవాబుదారీగా ఉంచాలని కోరారు.  ‘‘నఖ్చివాన్ అటానమస్ రిపబ్లిక్ భూభాగంపై పౌరులే లక్ష్యంగా ఇరాన్ మానవరహిత డ్రోన్లతో దాడులు చేసింది. అజర్‌బైజాన్ ఈ దారుణమైన ఉగ్రవాద చర్యను తీవ్రంగా ఖండిస్తుంది. ఈ దాడికి ఇరాన్ క్షమాపణ చెప్పి తీరాల్సిందే. అలాగే.. ఈ దుర్ఘటనకు పాల్పడిన వారిని వెంటనే జవాబుదారీగా ఉంచాలి” అని అల్లియేవ్ డిమాండ్ చేశారు. 

ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో మండుతున్న యుద్ధజ్వాలలు ఇప్పుడు పొరుగు దేశాలకు కూడా విస్తరిస్తున్నాయి. మార్చి 5, 2026న ఇరాన్ నుంచి ప్రయోగించిన డ్రోన్లు అజర్బైజాన్ భూభాగంలోని ఒక విమానాశ్రయంపై దాడి చేయడంతో ప్రాంతీయ ఉద్రిక్తతలు ఒక్కసారిగా పతాక స్థాయికి చేరుకున్నాయి.

గురువారం  మధ్యాహ్నం సమయంలో ఇరాన్ సరిహద్దుల నుంచి వచ్చిన రెండు డ్రోన్లు అజర్బైజాన్ ఎక్స్ క్లేవ్ అయిన ‘నఖ్చివన్’ ప్రాంతంలోకి చొరబడ్డాయి. వీటిలో ఒకటి నేరుగా నఖ్చివన్ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ భవనాన్ని ఢీకొట్టింది. మరో డ్రోన్ సమీపంలోని షెకరాబాద్ గ్రామంలో ఉన్న ఒక పాఠశాల వద్ద పేలిపోయింది. ఈ ఘటనలో విమానాశ్రయ భవనం పాక్షికంగా దెబ్బతినగా.. ఇద్దరు పౌరులు తీవ్రంగా గాయపడ్డారు.

అజర్బైజాన్ ఆగ్రహం..

ఈ దాడిని అజర్బైజాన్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. బాకులోని ఇరాన్ రాయబారిని పిలిపించి అజర్బైజాన్ విదేశాంగ శాఖ గట్టి నిరసన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ జరిగిన ఈ దాడికి ఇరాన్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. తమ భూభాగంపై జరిగిన ఏ దాడికైనా తగిన రీతిలో ప్రతీకారం తీర్చుకునే హక్కు తమకు ఉందని అజర్బైజాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది.

©️ VIL Media Pvt Ltd.