Reading Time: 2 minutes

Sanju Samson: నచ్చిన స్థానంలో సంజు శాంసన్ స్టైలిష్ బ్యాటింగ్.. కొడితే మ్యాచ్ గెలవాల్సిందే! 

Caption of Image.

Sanju Samson: ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌పై సంజు శాంసన్ ఆడిన అద్భుత బ్యాటింగ్ ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. సూపర్ 8 దశలో జరిగిన ఈ కీలక మ్యాచ్‌లో కేవలం 50 బంతుల్లోనే అజేయంగా 97 పరుగులు చేసి భారత జట్టుకు సంజు విజయాన్ని అందించాడు. అతని ఇన్నింగ్స్‌లో క్లాస్, కాన్ఫిడెన్స్, కంట్రోల్ అన్నీ కనిపించాయి. ఇప్పటి వరకు అతడు ఆడిన 25 ఇన్నింగ్స్‌లలో ఓపెనర్‌గా దిగినప్పుడు 30కి పైగా సగటుతో,  ఓవర్‌కు 10.66 పరుగుల స్ట్రైక్‌రేట్‌తో రాణించాడు. కొత్త బంతిని ఎదుర్కొనడం అతనికి ఎంతో ఇష్టం.. డ్రైవ్స్, లిఫ్ట్స్, పుల్ షాట్లలో అతని నైపుణ్యం ప్రత్యేకంగా కనిపిస్తుంది. అభిషేక్ శర్మతో కలిసి భారత జట్టుకు ఐదవ అత్యుత్తమ ఓపెనింగ్ జంటగా నిలిచిన ఈ జోడీ, 20 ఇన్నింగ్స్‌లలో 462 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది.

అయితే సంజు కెరీర్‌లో స్థిరత్వం లోపించిందనే విమర్శలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. కానీ 2024 అక్టోబర్ 12 నుంచి నవంబర్ 15 వరకు జరిగిన సిరీస్‌లలో అతను మూడు సెంచరీలు  (బంగ్లాదేశ్‌పై 111, దక్షిణాఫ్రికాపై 107, 109)  సాధించి తన సూపర్ ఫామ్‌లో కనిపించాడు. సంజు శాంసన్ ఇప్పటివరకు కేవలం 60 టీ20 మ్యాచ్‌లే ఆడాడు.. 2015లో అరంగేట్రం చేసిన తర్వాత భారత్ మొత్తం 221 టీ20 మ్యాచ్‌లు ఆడగా, అందులో 161 మ్యాచ్‌లకు అతను దూరమయ్యాడు. అయినప్పటికీ శాంసన్ జట్టులో ఉన్నప్పుడు భారత్ 80 శాతం మ్యాచ్‌లలో విజయం సాధించడం విశేషం. అతను లేకపోతే గెలుపు శాతం కేవలం 69.39గా ఉంది. 

►ALSO READ | T20 World Cup: భారత్ కి గవాస్కర్ సూచన.. బుమ్రా అప్పుడు బౌలింగ్ చేస్తేనే టోర్నీ నుంచి ఇంగ్లాండ్ ఔట్!

భారత జట్టులో వికెట్‌కీపర్‌గా ఎంఎస్ ధోనీ, రిషభ్ పంత్, ఇషాన్ కిషన్, దినేష్ కార్తిక్, జితేశ్ శర్మల వంటి ఆటగాళ్ల మధ్య తీవ్రమైన పోటీ ఉండటంతో సంజుకు అవకాశాలు తగ్గిపోయాయి. అయినప్పటికీ, జట్టులోకి వచ్చిన ప్రతీసారి తన ప్రతిభతో మళ్లీ తన స్థానాన్ని సాధించుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. తాజాగా, ఈడెన్ గార్డెన్స్‌లో అతను ఆడిన ఇన్నింగ్స్ తన కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శనలలో ఒకటిగా నిలిచింది. ఇక ఇంగ్లాండ్‌తో జరగనున్న సెమీఫైనల్‌లో జోఫ్రా ఆర్చర్ వంటి వేగవంతమైన బౌలర్లను ఎదుర్కోవాల్సి ఉంది. అయినప్పటికీ, ప్రస్తుత ఫామ్‌ను చూస్తే సంజు శాంసన్ టీమిండియాకు ప్రధాన ఆయుధంగా నిలిచే ఛాన్స్ ఉంది.  

©️ VIL Media Pvt Ltd.