
పెట్రోలియం, రిటైల్, టెలికాం, పవర్ అంటూ అనేక వ్యాపారాల్లో ఉన్న అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ రక్షణ రంగంలోకి కూడా అడుగుపెట్టింది. ఇందులో భాగంగా బ్రిటన్‌కు చెందిన ప్రముఖ ఏరోస్పేస్ ఇంజిన్ తయారీ సంస్థ రోల్స్ రాయిస్ సంస్థతో చేతులు కలిపింది. భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రాజెక్ట్ కోసం అత్యాధునిక యుద్ధ విమాన ఇంజిన్లను సంయుక్తంగా అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించాయి.
ఈ వ్యూహాత్మక ఒప్పందంలో భాగంగా భారత్‌లోనే ఒక ప్రత్యేకమైన ఏరోస్పేస్ గ్యాస్ టర్బైన్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని రెండు కంపెనీలు ప్లాన్ చేస్తున్నాయి. ఈ కేంద్రాన్ని పవర్ అండ్ ప్రొపల్షన్ టెక్నాలజీ రంగంలో ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా తీర్చిదిద్దనున్నారు. దీని ద్వారా విమాన ఇంజిన్ల డిజైన్, తయారీ, పరీక్షలు నిర్వహించడం వంటి అన్ని దశల్లోనూ స్వదేశీ సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.
దేశ స్వయంప్రతిపత్తికి కీలక రంగాలలో సొంత సాంకేతికత ఉండటం ఎంతో అవసరమని ఈ భాగస్వామ్యంపై రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ తెలిపారు. రోల్స్ రాయిస్ కలిగి ఉన్న ప్రపంచ స్థాయి ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని.. రిలయన్స్ తయారీ, సాంకేతిక శక్తిని జోడించి దేశంలో బలమైన ఏరో-ఇంజిన్ ఎకోసిస్టమ్‌ను నిర్మిస్తామని చెప్పారు.
ఇంజన్ల తయారీలో తమకు ఉన్న ఇంజనీరింగ్ అనుభవాన్ని, రిలయన్స్ ఇండస్ట్రీస్ నాయకత్వంతో కలిసి భారత్‌లో రక్షణ రంగాన్ని బలోపేతం చేసేందుకు ఇదొక చారిత్రక అడుగుగా రోల్స్ రాయిస్ సీఈఓ తుఫాన్ ఎర్గిన్‍బిలిక్ అభివర్ణించారు. ఈ డీల్ ప్రధాని మోడీ కలలు కంటున్న ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనకు ఎంతగానో దోహదపడుతుందని రెండు కంపెనీలు పేర్కొన్నాయి. డిఫెన్స్, ఏవియేషన్ రంగానికి భవిష్యత్తులో ఈ డీల్ కీలకంగా మారనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.