టీకి అలవాటుపడిన వారు దాన్ని పూర్తిగా వదిలేయడం అసాధ్యమని భావిస్తుంటారు. కానీ కేవలం ఒక నెల రోజుల పాటు టీకి దూరంగా ఉంటే శరీరంలో ఎన్నో సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రక్రియ క్రమంగా శరీరాన్ని డీటాక్స్ చేసి, జీవక్రియలను సరిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
టీ మానేసిన మొదటి వారం శరీరం కొత్త మార్పులకు సర్దుబాటు అయ్యే క్రమంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కెఫిన్ అందకపోవడం వల్ల శరీరంలో అడెనోసిన్ అనే రసాయన ప్రభావం పెరిగి నీరసం, తలనొప్పి, ఏకాగ్రత లోపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఇది కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉండే తాత్కాలిక సమస్య.
రెండో వారం వచ్చేసరికి శరీరం కొత్త మార్పులకు అలవాటుపడుతుంది. మొదటి వారంలో వేధించిన తలనొప్పి పూర్తిగా తగ్గిపోతుంది. అడెనోసిన్ స్థాయిలు స్థిరీకరణ చెందడంతో శరీరంలో సహజసిద్ధమైన శక్తి పెరుగుతుంది. నిద్రలేమి సమస్యలు తొలగిపోయి, గాఢమైన నిద్ర పట్టడం మొదలవుతుంది.
మూడో వారం నాటికి జీర్ణవ్యవస్థలో గణనీయమైన మార్పులు కనిపిస్తాయి. టీలోని టానిన్లు సాధారణంగా ఎసిడిటీ, గ్యాస్, కడుపులో మంట వంటి సమస్యలకు కారణమవుతాయి. టీ మానేయడం వల్ల ఈ సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి. అంతేకాకుండా టీ కారణంగా శరీరం గ్రహించలేకపోయిన ఐరన్ స్థాయిలు పెరిగి, రక్తహీనత వంటి సమస్యలు తగ్గుతాయి. దంతాలపై పేరుకుపోయిన మరకలు తగ్గి, దంతాల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
చివరగా నాలుగవ వారం పూర్తయ్యే సమయానికి శరీరం పూర్తి స్థాయి తేలికదనాన్ని, నిరంతర ఉత్సాహాన్ని పొందుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు, రక్తపోటు అదుపులోకి రావడమే కాకుండా పొట్ట ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడుతుంది. టీ లేకుండా ఉండలేము అనుకునేవారు ఒక్క నెల పాటు ఈ మార్పును ప్రయత్నిస్తే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.




