
ప్రతి తల్లిదండ్రి తమ పిల్లల భవిష్యత్తు.. ముఖ్యంగా చదువులు, పెళ్లికి అవసరమైన ఆర్థిక భద్రత కల్పించడం అత్యంత ప్రాధాన్యమైన విషయం. పుట్టినప్పటి నుంచే చిన్న మొత్తాలను క్రమంగా పొదుపు చేయడం ద్వారా పెద్ద నిధిని సమకూర్చొచ్చు వారి భవిష్యత్తు కోసం. దీనికోసం భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అద్భుతమైన పథకమే సుకన్య సమృద్ధి యోజన(SSY). ఆడపిల్లల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ స్కీమ్ ద్వారా.. తల్లిదండ్రులు ఎలాంటి ఆర్థిక ఒత్తిడి లేకుండా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు.
చిన్న వయసులోనే ఖాతా ప్రారంభం:
ఈ స్కీమ్ కింద ఆడపిల్ల వయసు 10 సంవత్సరాలు నిండేలోపు పోస్టాఫీసు లేదా బ్యాంకుల్లో అకౌంట్ ఓపెన్ చేయెుచ్చు. సాధారణంగా ఒక కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లల పేరిట అకౌంట్ తెరిచేందుకు వీలవుతుంది. అయితే కవలలు లేదా ముగ్గురు ఆడపిల్లలు జన్మించిన ప్రత్యేక సందర్భాల్లో నిబంధనలకు లోబడి మినహాయింపులు ఉంటాయి. తల్లిదండ్రులు, చట్టపరమైన సంరక్షకులు ఈ ఖాతాను నిర్వహించవచ్చు. ప్రస్తుతం ఈ పథకంపై ప్రభుత్వం 8.2% వార్షిక వడ్డీ చెల్లిస్తోంది. ఈ వడ్డీ రేటును ప్రభుత్వం ప్రతి 3 నెలలకు ఒకసారి సమీక్షిస్తుంది.
రోజుకు కేవలం రూ. 250 పెట్టుబడితో..
పెట్టుబడి విషయానికి వస్తే.. ఏడాదికి కనీసం రూ. 250 నుంచి గరిష్టంగా రూ.లక్షన్నర వరకు జమ చేయవచ్చు. ఉదాహరణకు పేరెంట్స్ ఆడబిడ్డ పేరుపై ఖాతా ఓపెన్ చేసి రోజూ రూ. 250 చొప్పున ఆదా చేస్తే:
* నెలవారీ సగటు పెట్టుబడి: సుమారు రూ.7వేల 604
* ఏడాదికి పెట్టుబడి: రూ.91వేల 250
* పెట్టుబడి కాలపరిమితి: 15 సంవత్సరాలు
* మొత్తం జమ అయ్యే సొమ్ము: రూ.13లక్షల 68వేల 750
21 ఏళ్లలో భారీ రాబడి..
రోజూ రూ.250 దాచిన లెక్కల ప్రకారం 15 సంవత్సరాల పాటు క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే మొత్తం రూ.13.68 లక్షలు జమ అవుతాయి. దీనిపై వచ్చే అంచనా వడ్డీ దాదాపు రూ. 26.69 లక్షలు ఉంటుంది. ఖాతా ప్రారంభించిన 21 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ సమయంలో చేతికి అందే మొత్తం సొమ్ము దాదాపుగా రూ.40 లక్షలకు పైనే ఉంటుంది.
పన్ను ప్రయోజనాలు..
ఆర్థిక ప్రణాళికలో పన్ను ఆదా కూడా కీలకమైనదే. పాత పన్ను విధానం ప్రకారం.. ఈ పథకంలో చేసే పెట్టుబడులపై ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సి కింద ఏడాదికి రూ.లక్షా 50వేల వరకు మినహాయింపు పొందవచ్చు. అంతేకాకుండా స్కీమ్ ద్వారా లభించే వడ్డీ, మెచ్యూరిటీ మొత్తం పూర్తిగా పన్ను రహితం. ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 21 సంవత్సరాలు అయినప్పటికీ.. అమ్మాయికి 18 ఏళ్లు నిండిన తర్వాత విద్య లేదా ఇతర అవసరాల కోసం రూల్స్ ప్రకారం 50% వరకు డబ్బును విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. సో ఇన్ని ప్రయోజనాలతో పాటు ఆర్థిక భరోసాను అందిస్తున్న స్కీమ్ తల్లిదండ్రులు సధ్వినియోగం చేసుకోవటం ముఖ్యం.