
తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి వేదికగా మాట్లాడిన సీఎం రేవంత్.. రేషన్ కార్డు కేవలం ఓ ప్లాస్టిక్ వస్తువు కాదని, పేదల ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. పేదల ఆకలి తీర్చడమే స్మార్ట్ రేషన్ కార్డు ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు.
పేదల కోసం రేషన్ షాపులను తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. పేదలకు సంక్షేమం అందించడం తమ ప్రభుత్వ బాధ్యత అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రతిపక్షాలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్, బీజేపీ వేర్వేరు కాదని.. బొమ్మ, బొరుసులాంటివేనని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు.
తెలంగాణలో సన్నబియ్యం పంపిణీపై సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్లలో సన్నబియ్యం ఇవ్వాలని ఎప్పుడైనా ఆలోచించారా అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం 3 కోట్ల 48 లక్షల మందికి ప్రతినెలా ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం అందిస్తోందన్నారు. సన్నబియ్యం పంపిణీ ప్రారంభించిన తర్వాతే మార్కెట్‌లో ధరలు తగ్గాయని పేర్కొన్నారు.
రైతుల అంశంపైనా రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంట్ పోతుందని గతంలో ప్రచారం చేశారని, కానీ అలా జరగలేదన్నారు. గత ప్రభుత్వం వరి వేస్తే ఉరి అన్న పరిస్థితి తీసుకొచ్చిందని విమర్శించారు. అయితే ఆ సమయంలో అధికారంలో ఉన్నవారు ఫామ్‌హౌస్‌లో వరి సాగు చేశారని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం వరి పండించిన రైతులకు బోనస్ ఇచ్చి ధాన్యం కొనుగోలు చేసిందన్నారు.
ఇందిరాగాంధీ హయాంలో BDL, BHEL వంటి కేంద్ర సంస్థలు తెలంగాణకు వచ్చిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. ఇందిరా స్ఫూర్తితో ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తూ తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
అలాగే రైతులకు ఎవరేం చేశారో అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అంటూ మాజీ సీఎం కేసీఆర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. రైతులు పండించిన ధాన్యానికి ప్రభుత్వం రూ.90 వేల కోట్లను బదిలీ చేసిందని తెలిపారు. పేదలకు విద్య, వైద్యం, ఉపాధి కల్పించడమే కాంగ్రెస్ సంక్షేమ విధానమని సీఎం స్పష్టం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..