Reading Time: 2 minutes
చిలుక జోస్యం వెనుక చీకటి నిజాలు.. ఈ చట్టం గురించి తప్పక తెలుసుకోండి..

దేవాలయాల ముంగిట, జాతరల్లో, రహదారుల పక్కన పంజరంలో చిలుకతో జోస్యం చెప్పడం మనం చూస్తూనే ఉంటాం. పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారంగా భావించే ఈ చిలుక జోస్యం వెనుక మూగజీవుల వేదనతో పాటు తీవ్రమైన చట్టపరమైన నేరం దాగి ఉందని చాలామందికి తెలియదు. భారతదేశంలో రోజ్ రింగ్డ్ పారాకీట్, అలెగ్జాండ్రైన్ పారాకీట్ వంటి స్థానిక చిలుక జాతులను పట్టుకోవడం, పంజరాల్లో బంధించడం, వ్యాపారం చేయడం లేదా భవిష్యవాణి కోసం వాడటం వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం పూర్తిగా నిషేధం. 2022 చట్ట సవరణ అనంతరం ఈ జాతులను షెడ్యూల్ II పరిధిలోకి తెచ్చి రక్షణను మరింత కఠినతరం చేశారు.

భవిష్యత్తు చెప్పే చిలుకల జీవితం అంధకారం

అడవుల్లో స్వేచ్ఛగా, గుంపులుగా తిరిగే చిలుకలను వేటాడి పట్టుకోవడం నుంచే వాటి నరకం మొదలవుతుంది. అవి ఎగిరిపోకుండా ఉండేందుకు రెక్కల ఈకలను క్రూరంగా కత్తిరిస్తారు. చిన్న పంజరాల్లో బంధించి, ఆకలితో మాడ్చి భవిష్యవాణి కార్డులు తీసేలా శిక్షణ ఇస్తారు. ఈ క్రమంలో తీవ్రమైన ఒత్తిడికి గురై అనేక పక్షులు అనారోగ్యంతో మృత్యువాత పడుతున్నాయి. జంతు సంరక్షణ సంస్థల ఫిర్యాదులతో ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో అటవీ శాఖ అధికారులు వందలాది చిలుకలను రక్షించి జ్యోతిష్యులపై కేసులు నమోదు చేశారు.

ఉల్లంఘిస్తే తప్పని కఠిన శిక్షలు

వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని సెక్షన్లు 9, 39, 51 అలాగే జంతువులపై క్రూరత్వ నివారణ చట్టం 1960 కింద కేసులు నమోదు చేస్తారు. చిలుకలను బంధించినా, జోస్యానికి వాడినా 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా రూ.1,00,000 వరకు జరిమానా లేదా రెండూ విధించవచ్చు. పునరావృత నేరాలకు మరింత కఠినమైన శిక్షలు ఉంటాయి.

ఫిర్యాదు చేయడం ఎలా?

సంప్రదాయం ముసుగులో జరిగే ఈ క్రూరత్వాన్ని అరికట్టే బాధ్యత పౌరులందరిపై ఉంది. ఎక్కడైనా చిలుక జోస్యం లేదా పక్షుల అక్రమ రవాణా కనిపిస్తే వెంటనే స్పందించవచ్చు.

  • స్థానిక అటవీ శాఖ లేదా సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయవచ్చు.
  • వైల్డ్‌లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో ఆన్‌లైన్ పోర్టల్ లేదా టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ ద్వారా సమాచారం ఇవ్వవచ్చు.
  • PETA ఇండియా, VSPCA వంటి జంతు సంక్షేమ సంస్థలను సంప్రదిస్తే వారు అధికారులతో సమన్వయం చేసుకుని పక్షులను రక్షిస్తారు.
  • ఫిర్యాదుదారుల వివరాలను అధికారులు పూర్తిగా గోప్యంగా ఉంచుతారు.

మూగజీవులను బంధించి మన భవిష్యత్తును తెలుసుకోవాలనుకోవడం సంస్కృతి అనిపించుకోదు. పక్షుల స్వేచ్ఛను గౌరవించి, చట్టాన్ని పాటించడమే నిజమైన మానవత్వం.