Reading Time: 2 minutes
Fauzi Release Date Prabhas Movie Postponement December 3 2026

Fauzi Release Date: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. స్వాతంత్ర్యానికి పూర్వం నాటి యుద్ధ నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 3, 2026న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే తాజాగా సినిమా రిలీజ్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అభిమానుల్లో టెన్షన్ పెంచుతోంది. ‘ఫౌజీ’ మరోసారి వాయిదా పడే అవకాశం ఉందంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. షూటింగ్, ఇతర నిర్మాణ కార్యక్రమాల్లో జాప్యం కారణంగా డిసెంబర్ 3న సినిమా థియేటర్లలోకి రావడం కష్టమేనని కొందరు పేర్కొంటున్నారు. అయితే ఈ ప్రచారంపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు సినిమాను అనుకున్న తేదీకే విడుదల చేసేందుకు మేకర్స్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ‘ఫౌజీ’ పనులను ఏకకాలంలో కొనసాగించేలా మూడు యూనిట్లుగా విభజించినట్లు తెలుస్తోంది. ఒక టీమ్ రిహార్సల్స్, ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలను చూసుకుంటుండగా.. మరో యూనిట్ ప్యాచ్ వర్క్‌పై దృష్టి పెడుతోందని సమాచారం. కీలకమైన దర్శకత్వ పనులను మరో టీమ్ పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ప్రభాస్‌కు సంబంధించిన చివరి వర్కింగ్ డేట్ సెప్టెంబర్ 30గా ఉందనే టాక్ వినిపిస్తోంది. ఆలోపు తనకు సంబంధించిన షూటింగ్, ఇతర పనులను పూర్తి చేసేందుకు ప్రభాస్ కూడా చిత్రబృందానికి సహకరిస్తున్నట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ 3న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో టీమ్ శరవేగంగా పనిచేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ‘ఫౌజీ’ మరోసారి వాయిదా పడితే నెట్‌ఫ్లిక్స్‌తో కుదిరిన ఓటీటీ డీల్‌లో సుమారు 20 శాతం కోల్పోయే అవకాశం ఉందనే ప్రచారం కూడా గతంలో వినిపించింది. దీంతో ఈ సినిమా విషయంలో రిలీజ్ డేట్‌ కీలకంగా మారింది. అయితే ఓటీటీ డీల్‌కు సంబంధించిన ఈ వివరాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో కనిపించనుండగా.. మిథున్ చక్రవర్తి, జయప్రద, చైత్ర జె. అచార్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. మొత్తానికి ‘ఫౌజీ’ డిసెంబర్ 3న అనుకున్నట్టుగానే థియేటర్లలోకి వస్తుందా? లేక మరోసారి వాయిదా పడుతుందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనిపై క్లారిటీ రావాలంటే మేకర్స్ అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే.